- టెక్నికల్ టీమ్‌తో కస్టమర్ల వివరాలు సేకరించిన ఈగల్ ఫోర్స్
- గ్రేటర్ హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో సెర్చ్ ఆపరేషన్
- 19 మందికి టెస్టులు చేయగా 14 మందికి గంజాయి పాజిటివ్
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్, గంజాయి బానిసలపై ఈగల్ ఫోర్స్ కొరడా ఝలిపిస్తోంది. సప్లయర్ల మూలాలను కనిపెట్టి కస్టమర్ల ఆటకట్టిస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లతో పాటు మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో సోమవారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో డ్రగ్స్, గంజాయి వినియోగిస్తున్న 19 మందిని అదుపులోకి తీసుకుంది. వీరిలో వైద్య పరీక్షల్లో 14 మందికి టీహెచ్‌సీ (గంజాయిలో ఉండే మత్తు పదార్థం) పాజిటివ్‌గా తేలినట్లు ఈగల్ డైరెక్టరేట్ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈగల్ ఫోర్స్ టోల్‌ఫ్రీ వాట్సాప్ నంబర్ 8712671111కు అందిన సమాచారంతో ఈ ఆపరేషన్‌ను ప్రారంభించారు. అధికారిక ప్రకటన ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన చక్రీ అలియాస్ చక్రపాణి, హర్షిద్ రెడ్డి, సుశీల్ కృష్ణ అనే వ్యక్తులు గోవాలోని వగటార్ బీచ్ సమీపంలోని ఓ హాస్టల్‌లో అద్దెకు ఉంటున్నారు. వీరిలో చక్రపాణి, హర్షిద్ రెడ్డిపై 2019లో వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయి. అరెస్టు అయి, విడుదలైన అనంతరం వీరు గోవాకు వెళ్లారు.
అక్కడి నుంచి దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. బెంగళూరు నుంచి కొకైన్, ఎండీఎంఏ మాత్రలు, ఎల్‌ఎస్‌డీ తెప్పించి గోవా నుంచి హైదరాబాద్‌కు చేరవేస్తున్నారని.. ఒడిశా నుంచి హ్యాష్ ఆయిల్ సేకరిస్తున్నారని ఈగల్ ఫోర్స్‌కు సమాచారం అందింది. ప్రధానంగా కొకైన్‌ను సినీ పరిశ్రమకు చెందిన కొందరికి, ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ, హ్యాష్ ఆయిల్‌ను ఎల్‌బీనగర్ పరిసర ప్రాంతాల్లో కస్టమర్లకు విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు.
44 మంది కస్టమర్లు..
గోవా డ్రగ్స్ పెడ్లర్ల నెట్‌వర్క్‌లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, గోవా రాష్ట్రాలకు చెందిన 44 మంది డ్రగ్స్ కస్టమర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. గంజాయి పాజిటివ్ వచ్చిన 14 మంది కస్టమర్లు.. చక్రపాణి, హర్షిద్ రెడ్డి నుంచి గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు కొనుగోలు చేసినట్లు ఈగల్ ఫోర్స్ దర్యాప్తులో అంగీకరించారు. వీరు ఇటీవల చక్రపాణికి రూ.1.46 లక్షలు, హర్షిద్ రెడ్డికి రూ.1.66 లక్షలు బదిలీ చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. డ్రగ్స్ వినియోగించినట్లు ఒప్పుకున్న వారందరినీ వైద్య పరీక్షలకు పంపగా పాజిటివ్‌గా తేలింది. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి.. వారిని చికిత్స, పునరావాసం కోసం డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించారు.
