ఆ జిల్లాల్లో కంపించిన భూమి...  భయంతో జనం  పరుగులు 

ఆ జిల్లాల్లో కంపించిన భూమి...  భయంతో జనం  పరుగులు 

ప్రకాశం జిల్లాలో భూకంపం స్థానికులను కలవరపాటుకు గురి చేసింది. ముండ్లమూరులో ఆదివారం (మే7) ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాక హడలిపోయారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రిక్టర్ స్కేల్‌పై ఎంత మేర భూమి కంపించిందనేది తెలియాల్సి ఉంది.

వరుస భూకంపాలు

ఏపీలో ఇటీవల కాలంలో వరుసగా భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. ఎన్టీఆర్ జిల్లాలోని చందర్లపాడు, కంచికచర్ల, నందిగామ, వీరులపాడు మండలాల్లో భూకంపం చోటు చేసుకుంది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అధికారులు గ్రామాలకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.