- ఢిల్లీ సహా ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు
భారత్ – పాకిస్థాన్ సరిహద్దుల్లో ఇవాళ సాయంత్రం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. దీని ప్రభావం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎక్కువగా కనిపించింది. భూమికి నిలువునా పగుళ్లు వచ్చాయి. కొన్ని చోట్ల భవనాలు కూలిపోయాయి. రోడ్లు బద్దలుగా పగిలాయి. భూకంపం ధాటికి శిథిలాల కింది చిక్కి పీవోకేలోని మీర్ పూర్ నగరంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
మన జమ్ము కశ్మీర్ రాజధాని శ్రీనగర్ కు 140 కిలోమీటర్ల దూరంలో న్యూ మీర్ పూర్ వద్ద భూకంప కేంద్రం ఉందని అమెరికా జియాలజీ సర్వే కేంద్రం ప్రకటించింది. 10 కిలోమీటర్ల లోతులో ఎపిసెంటర్ కేంద్రీకృతమై ఉందని, అక్కడి నుంచి ప్రకంపనలు వ్యాపించాయని తెలిపింది.
మంగళవారం సాయంత్రం 4.32 గంటల సమయంలో ఒక్కసారిగా భారత్ – పాక్ సరిహద్దులు, ఇస్లామాబాద్, పీవోకే, ఢిల్లీ, నోయిడా సహా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఉలిక్కిపడిన ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. పీవోకేలోని మీర్ పూర్ లో భూకంప ప్రభావం తీవ్రంగా కనిపించింది. అక్కడ భూమి బద్దలుగా నోరు తెరిచింది. పలు చోట్ల భవనాలు కూలాయి. దీంతో ఆ శిథిలాల కింద పడి ఐదుగురు మరణించారు. 50 మంది గాయపడ్డారు. ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉ:ది. అక్కడ భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది.
జమ్ము కశ్మీర్లో సేఫ్
భారత్ లో ఎక్కడా భూకంపం ప్రభావం తీవ్రంగా లేదు. జమ్ము కశ్మీర్ సహా ఉత్తర భారతమంతా సేఫ్ గా ఉంది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అయితే స్వల్ప ప్రకంపనలతో ఇళ్లు కదిలినట్లు అనిపించడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు పెట్టారు. జమ్ము కశ్మీర్లో ఎక్కడా ఎటువంటి నష్టం సంభవించలేదని డీజీపీ దిల్బాగ్ సింగ్ ప్రకటించారు.
