Earthquake: ఢిల్లీని వణికిస్తోన్న వరుస భూకంపాలు

Earthquake: ఢిల్లీని వణికిస్తోన్న వరుస భూకంపాలు

దేశ రాజధాని ఢిల్లీని భూకంపాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. మార్చి 21న ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలో దాదాపు రెండు నిమిషాల పాటు భూమి కంపించగా.. తాజాగా మార్చి 22న భూకంపం మరోసారి వణికించింది. రిక్టర్‌ స్కేల్‌పై 2.7 తీవ్రతతో మధ్యాహ్నం 4.42 గంటలకు ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సిస్మోలజీ సెంటర్‌ తెలిపింది. హర్యానాలోని జాజ్జర్‌కు 37 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదుకిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఆందోళనకు గురైన ప్రజలు నివాస ప్రాంతాల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదని, ఇవి స్వల్ప ప్రకంపనలేనని పేర్కొంది.

మార్చి 21 మంగళవారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్టు అధికారులు స్పష్టం చేశారు. భూకంప కేంద్రాన్ని హిందుకుష్‌ పర్వత శ్రేణులు గుర్తించినట్లు ఎన్‌సీఎస్‌ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరభారతంలో ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌, జమ్మూ కశ్మీర్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లోనూ ప్రభావం కనిపించింది. దాదాపు రెండు నిమిషాల పాటు భూమి కంపించడంతో ఇండ్లు, భవనాలు ఊగిపోయాయి. దీంతో భయాందోళనకు గురైన జనం ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.