ఉగాండా ,కాంగో వంటి ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక వైరస్ ఎబోలా ఇప్పుడు ప్రపంచ దేశాలకు వ్యాపిస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది.ముందస్తు చర్యల్లో భాగంగా ఢిల్లీ , ముంబై , గుజరాత్ ఎయిర్ పోర్టులలో హైఅలర్ట్ ప్రకటించారు. కాంగో, ఉగాండా వంటి దేశాలనుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. ఇటీవల ఆఫ్రికానుంచి గుజరాత్ కు వచ్చిన ఓ వ్యాపారవేత్తతోపాటు నలుగురిని క్వారంటైన్ కు పంపించారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు.
అమోరి లోకోలాగా అనే 37 ఏళ్ల ఆఫ్రికన్ వ్యాపారవేత్త, కొద్ది రోజుల క్రితం ముంబైకి చేరుకుని అక్కడి నుంచి వడోదరకు వచ్చినట్లు గుర్తించారు. వడోదరలో ఆయనకు జ్వరం రావడంతో ముందుగా బ్యాంకర్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు, అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలోని ప్రత్యేక ఎబోలా ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వ్యాపారవేత్తతోపాటు ప్రయాణించిన పాట్రిక్ కాజా, వాలెంటిన్ జోడెల్ అనే మరో ఇద్దరిని, అలాగే వారితో సన్నిహితంగా ఉన్న డాక్టర్ సునీల్ ముసానాను కూడా అహ్మదాబాద్‌లోని ఎస్‌విపి ఆస్పత్రిలో వేర్వేరుగా క్వారంటైన్ చేశారు.
ALSO READ : కెనడాలో గుజరాత్‌కు చెందిన 22 ఏళ్ల యువతిని కత్తితో పొడిచి చంపేశారు
ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ చర్యలు తీసుకుంటున్నామని గుజరాత్ ఆరోగ్యమంత్రి తెలిపారు. అనుమానితులను 10 నుంచి 11 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతామని, వారి బ్లడ్ శాంపిల్స్ టెస్టులకోసం పుణెలోని ల్యాబ్‌కు పంపామని తెలిపారు.
ఇప్పటివరకు గుజరాత్‌లో గానీ, భారతదేశంలో గానీ ఒక్క ఎబోలా కేసు కూడా నిర్ధారణ కాలేదు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న రోగుల పరిస్థితి నిలకడగా ఉంది. వారి శరీర ఉష్ణోగ్రత సాధారణంగానే ఉంది. పుణె ల్యాబ్ నుంచి రిపోర్టులు వచ్చాకే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇది కేవలం ముందుజాగ్రత్తగా తీసుకున్న చర్య మాత్రమే కాబట్టి ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి పన్షేరియా స్పష్టం చేశారు.
