కెనడాలో గుజరాత్‌కు చెందిన 22 ఏళ్ల యువతిని కత్తితో పొడిచి చంపేశారు

కెనడాలో గుజరాత్‌కు చెందిన 22 ఏళ్ల యువతిని కత్తితో పొడిచి చంపేశారు

ఒట్టావా: కెనడాలో భారతీయ యువతి దారుణ హత్యకు గురైంది. కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. అనంతరం మృతదేహాన్ని నయాగరా ప్రాంతంలోని అమెరికా సరిహద్దు దగ్గర పడేశారు. మృతురాలిని గుజరాత్ రాష్ట్రం ఆనంద్ జిల్లాలోని బోర్సాద్‌కు చెందిన 22 ఏళ్ల విధి మేఘగా పోలీసులు గుర్తించారు. 

గుజరాత్‎కు చెందిన విధి మేఘ ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లింది. ఆర్థికంగా తనను తాను పోషించుకోవడానికి చదువుకుంటూనే ఉద్యోగం కూడా చేస్తోంది. కెనడాలో శాశ్వత నివాసం (PR) కోసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా రెడీ అవుతోంది. అయితే, 2026, మే 15న ఇంటి నుంచి బయటకు వెళ్లిన మేఘ అదృశ్యమైనట్లు పోలీసులకు సమాచారం అందింది.

 మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టగా.. అమెరికా సరిహద్దు సమీపంలోని నయాగరా ప్రాంతంలో ఆమె మృతదేహం లభ్యమైంది. విధిని కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానితుడిని త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు. 

ALSO READ : జీతం సరిపోతలేదు బాస్

ఉన్నత చదువులు, మంచి భవిష్యత్ కోసం విదేశాలకు వెళ్లిన కూతురు విగతజీవిగా మారడంతో మేఘ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కెనడాలో భారతీయ విద్యార్థులు హత్యకు గురి కావడం ఇదే తొలిసారు కాదు. గతంలో కూడా కెనడాలో ఇండియన్ స్టూడెంట్స్ హత్యకు గురయ్యారు. తాజా ఘటనతో విదేశాలలో నివసిస్తున్న భారతీయ విద్యార్థుల భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది.