గాంధీలో ఎబోలా కలకలం!..ఇద్దరు అనుమానితుల్లో ఒకరికి నెగెటివ్..

గాంధీలో ఎబోలా కలకలం!..ఇద్దరు అనుమానితుల్లో ఒకరికి నెగెటివ్..
  • మరొకరి రిపోర్టు కోసం వెయిటింగ్​
  • ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు
  • గాంధీ ఎబోలా నోడల్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లోని గాంధీ ఆస్పత్రిలో ఎబోలా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు ఆస్పత్రిలో రెండు అనుమానిత కేసులు నమోదైనట్లు గాంధీ ఎబోలా నోడల్ ఆఫీసర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వంశీకృష్ణ వెల్లడించారు. మొదటి అనుమానిత బాధితుడు రెండు రోజులుగా చికిత్స పొందుతున్నాడు. మరోవైపు జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి నుంచి గురువారం రాత్రి గాంధీ ఆస్పత్రికి మరో ఇద్దరు వచ్చారని, వారిలో ఒకరు రోగి కాగా, మరొకరు అటెండర్ అని తెలిపారు.

సూడాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన అబ్దుల్ రఫీ మహ్మద్ ఆదమ్ ఇస్సా (23) అనే బాధితుడిని ఐసోలేషన్ రూమ్‌‌‌‌‌‌‌‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అయితే, అటెండర్​కు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోవడంతో కేవలం అతడి ప్రయాణ చరిత్ర ఆధారంగా ముందస్తు జాగ్రత్తగా హోమ్ ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌లో ఉండాలని సూచించినట్లు తెలిపారు. బాధితుల నుంచి సేకరించిన నమూనాలను ప్రాథమిక పరీక్షల కోసం సీసీఎంబీకి పంపించామని తెలిపారు. కాగా, వీరంతా ఒకే విమానంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వచ్చినట్లు సమాచారం.

ఈ వ్యాధిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చిన వారితో లేదా ఎబోలా లక్షణాలతో బాధపడుతున్న వారితో సన్నిహితంగా ఉంటే తప్ప ఈ వ్యాధి ఇతరులకు సోకే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇద్దరిలో ఒకరికి నెగిటీవ్..

గాంధీ ఆస్పత్రిలోని ఎబోలా ఐసోలేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్న సుడాన్ దేశస్తుడికి (మొదటి అనుమానితుడు) ఊరట లభించింది. ఎబోలా లక్షణాలతో రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన మహ్మద్ యాహ్యా యాగోబ్ అహ్మద్ (35)కు ఎబోలా లేదని తేలింది. ఈ విషయాన్ని గాంధీ ఆస్పత్రి ఎబోలా సెంటర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ శుక్రవారం రాత్రి అధికారికంగా వెల్లడించారు. కాగా, ప్రస్తుతం గాంధీ ఎబోలా ఐసోలేషన్ కేంద్రంలో ఉన్న మరో వ్యక్తికి సంబంధించిన మెడికల్ రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది.