సర్ అమలుకు చర్యలు చేపట్టండి..తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు, యూటీలకు ఈసీఐ ఆదేశం

సర్ అమలుకు చర్యలు చేపట్టండి..తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు, యూటీలకు ఈసీఐ ఆదేశం
  • 2 రోజుల సమావేశానికి స్టేట్ సీఈవో సుదర్శన్ రెడ్డి హాజరు

న్యూఢిల్లీ, వెలుగు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) అమలుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశించింది. సర్ అమలుపై బుధ, గురు వారాల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలు/యూటీల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు (సీఈవో)తో ఈసీఐ 2 రోజులు సమావేశం ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 10న జరిగిన సమావేశానికి కొనసాగింపుగా... ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ మేనేజ్​మెంట్ (ఐఐఐడీఈఎం)లో ఈ సమావేశం నిర్వహించారు.

 ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్ బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి, తెలంగాణ సీఈవో సుదర్శన్ రెడ్డి, వివిధ రాష్ట్రాలు/యూటీల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్ పై కమిషన్ సీనియర్ అధికారులు ప్రజెంటేషన్లు ఇచ్చారు. అలాగే, పలు రాష్ట్రాల సీఈవోలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గత సమావేశం ప్రకారం ఈసీవోలు జారీ చేసిన ఆదేశాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 

ఆయా రాష్ట్రాలు/యూటీల్లో చివరగా పూర్తయిన సర్ ప్రకారం ఓటర్ల సంఖ్య, చివరి సర్ తేదీ, ఓటర్ల జాబితాపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఈసీఐ.. ఆయా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్ అమలుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అలాగే, త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు/యూటీల సీఈవోలతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా చర్చించింది.