మనీ లాండరింగ్ కేసులో..పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరా అరెస్టు

మనీ లాండరింగ్  కేసులో..పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరా అరెస్టు

 

  • మనీ లాండరింగ్  కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ ఆఫీసర్లు    
  • అరెస్టు అక్రమమని సీఎం భగవంత్ మాన్ ఫైర్

చండీగఢ్: పంజాబ్  పరిశ్రమల శాఖ మంత్రి సంజీవ్  అరోరాను మనీ లాండరింగ్​కు సంబంధించిన కేసులో ఎన్ ఫోర్స్​మెంట్  డైరెక్టరేట్(ఈడీ) అధికారులు శనివారం అరెస్టు చేశారు. ప్రివెన్షన్  ఆఫ్  మనీ లాండరింగ్  యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ముందుగా చండీగఢ్​లోని ఆయన నివాసంతో పాటు ఢిల్లీలో రెండు చోట్ల, గురుగ్రాంలో ఉద్యోగ్  విహార్ లోని హాంప్టన్  స్కై రియాలిటీ లిమిటెడ్  కంపెనీలో సోదాలు నిర్వహించారు. 

సోదాల సందర్భంగా మంత్రి తమకు సహకరించలేదని, తాము అడిగిన ప్రశ్నలకు జవాబివ్వలేదని అధికారులు తెలిపారు. దీంతో ఆయనను ఆయనను ఢిల్లీకి తరలించాలని నిర్ణయించామన్నారు. కాగా, గత నెల 17న కూడా ఫారిన్  ఎక్స్ చేంజ్  మేనేజ్ మెంట్  యాక్ట్  (ఫెమా) కింద కూడా అరోరా నివాసం, ఆయన సంస్థల్లో ఈడీ అధికారులు రెయిడ్లు నిర్వహించారు. తర్వాత అదే నెల 19న హాంప్టన్  స్కై రియాలిటీకి చెందిన స్థిర, చరాస్తులతో పాటు ఆ కంపెనీకి డైరెక్టర్ గా ఉన్న మంత్రి స్థిర, చరాస్తులను కూడా అటాచ్  చేశారు. రూ.157.12 కోట్ల విలువైన బోగస్  అమ్మకాలు, ఎగమతులు జరిపారని అధికారులు పేర్కొన్నారు.

ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతున్నరు: సీఎం

మంత్రి సంజీవ్ అరోరా అరెస్ట్ అక్రమమని పంజాబ్  సీఎం భగవంత్ సింగ్  మాన్ ఆరోపించారు. కేంద్ర సంస్థలను ఎన్డీయే ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. కాగా.. ఫేక్  జీఎస్టీతో మంత్రి అరోరా రూ.100 కోట్ల మేర మొబైల్ ఫోన్లు కొని వాటిని విదేశాలకు ఎగుమతి చేశారని, అలాగే  దుబాయ్  నుంచి ఇండియాకు అక్రమంగా నిధులు తరలించారని ఈడీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఢిల్లీలో డొల్ల కంపెనీల నుంచి ఆ ఫేక్  జీఎస్టీ కొనుగోళ్లు జరిపి తప్పుడు మార్గంలో ఇన్ పుట్  ట్యాక్స్  క్రెడిట్  పొందారని తెలిపారు.