
- హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లోని సెంటర్లలో తనిఖీలు
- బ్యాంక్ అకౌంట్లు, రికార్డులు స్వాధీనం..
హైదరాబాద్, వెలుగు:సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తులోభాగంగా తెలంగాణ,ఏపీలోని 9 ప్రాంతాల్లో ఈడీ గురువారం ఏకకాలంలో సోదాలు చేపట్టింది.హైదరాబాద్‌లోని ఐదు, విజయవాడలోని రెండు, విశాఖపట్నంలోని రెండు సెంటర్లలో తనిఖీలు చేసింది. ఈ సందర్భంగా బ్యాంక్ అకౌంట్లు, రికార్డులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
సరోగసీ పేరుతో మోసాలకు పాల్పడిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్.. తెలంగాణ సహా 8 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నడిపింది. ఈ దందాపై హైదరాబాద్ నార్త్ జోన్‌లోని గోపాలపురం పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఇప్పటికే ఈసీఐఆర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితురాలు నమ్రత సహా ఇతర నిందితుల బ్యాంక్ లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లు, విదేశాలు సహా దేశవ్యాప్తంగా పెట్టుబడుల వివరాలు సేకరించింది. ఈ క్రమంలోనే గురువారం సోదాలు జరిపింది.
ప్రధానంగా ఏపీ, తెలంగాణ కేంద్రంగానే ఈ దందా కొనసాగినట్టు పక్కా ఆధారాలు లభించడంతో.. ఆ మేరకు తనిఖీలు చేపట్టి, కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కాగా, ఈ కేసులో ఇప్పటికే 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.40 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్టు, ఈ డబ్బును వివిధ మార్గాల్లో మనీ లాండరింగ్ చేసినట్టు ఆధారాలు సేకరించారు.
ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత, ఆమె భర్త సురేశ్, ఆమె చెల్లి కీర్తి సహా దాదాపు 50 మందికిపైగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా భారీగా సంపాదించినట్లు గుర్తించారు. పిల్లలు పుట్టని దంపతుల నుంచి సరోగసీ పేరుతో రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసేవారని, కానీ రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పిల్లలను కొనుగోలు చేసి వాళ్లకు అప్పగించేవారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 86 మందికి పైగా పిల్లలను చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్టు తేలింది.