బియ్యం దందాపై ఈడీ ఎంక్వైరీ.. రూ.6 వేల కోట్లకుపైగాఎగ్గొట్టిన మిల్లర్లు

బియ్యం దందాపై ఈడీ ఎంక్వైరీ.. రూ.6 వేల కోట్లకుపైగాఎగ్గొట్టిన మిల్లర్లు
  • ఆ సొమ్ముతో రియల్ ఎస్టేట్ సహా ఇతర సంస్థల్లో పెట్టుబడులు
  • కుటుంబసభ్యులు, బినామీల పేరిట భారీగా ఆస్తిపాస్తుల కొనుగోలు
  • సూర్యాపేట జిల్లాలో ఏకంగా సినిమా తీసిన మిల్లర్​
  • విజిలెన్స్ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ దాడుల్లో 
  • ఇలాంటి పలు దందాలు బట్టబయలు
  • ఆ నివేదికల ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో 
  • దర్యాప్తుకు ఈడీ రెడీ.. ఈసీఐర్ నమోదుతో పెరిగిన హీట్​

హైదరాబాద్, వెలుగు:మిల్లింగ్​కోసం సర్కారు ఇచ్చిన వేల కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్​మిల్లర్లపై ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) ఫోకస్ పెట్టింది. గత పదేండ్లలో ప్రభుత్వానికి తిరిగి ఇయ్యాల్సిన రూ.6 వేల కోట్లకుపైగా విలువైన బియ్యాన్ని బయట మార్కెట్‌‌‌‌లో, విదేశాలకు అమ్ముకొని వచ్చిన సొమ్మును రియల్​ఎస్టేట్​సహా ఇతర దందాల్లో పెట్టుబడి పెట్టినట్టు విజిలెన్స్ ​అండ్ ​ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ విభాగం గుర్తించింది. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఒక మిల్లర్​.. ధాన్యం సొమ్ముతో ఏకంగా ఓ సినిమా తీసినట్టు ఇటీవలే వెలుగుచూసింది. ఈ మేరకు విజిలెన్స్ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ ​విభాగం సర్కారుకు అందించిన డాక్యుమెంట్ల ఆధారంగా ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ కేస్ ఇన్‌‌‌‌ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐర్) నమోదు చేసిన ఈడీ అధికారులు మనీలాండరింగ్​కోణంలో దర్యాప్తు చేసేందుకు సిద్ధమయ్యారు.

వందల కోట్లు కొట్టేసి.. రియల్ ​ఎస్టేట్‌‌‌‌లో పెట్టుబడులు  

ప్రభుత్వం  2014 నుంచి 2025 వరకు రైతుల వద్ద కొనుగోలు చేసి, మిల్లింగ్​ కోసం అప్పగించిన రూ. 13,399.71 కోట్ల విలువైన 59.95 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించారు. ఇందులో నుంచి ఇప్పటివరకు 31.73 లక్షల  టన్నుల  ధాన్యానికి సంబంధించిన రూ.6,768.97 కోట్లు రిక వరీ చేయగా, మరో 28.22 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.6,630.74 కోట్లు ప్రభుత్వానికి రావాల్సి ఉంది.

కస్టమ్ ​మిల్లింగ్ ​రైస్ నిబంధనల ప్రకా రం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని 3 నెలల్లోపు మరాడించి ప్రతి క్వింటాల్‌‌కు 67 కిలోల చొప్పున బియ్యం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఏండ్లు గడుస్తున్నా మెజార్టీ మిల్లర్లు బియ్యం అప్పగించలేదు. విజిలెన్స్ ఎన్‌‌ఫోర్స్‌‌ మెంట్​ఇప్పటికి పలుమార్లు చేసిన దాడుల్లో అసలు సర్కారు ఇచ్చిన ధాన్యం మిల్లుల్లో లేనట్లు తేలింది. కొన్ని చోట్ల మిల్లుల పేరుతో ఉన్న గోడౌన్లకే సివిల్​సప్ల య్​ అధికారులు కోట్ల విలువైన వడ్లు కేటాయించారు.  

ఇంకొన్నిచోట్ల మిల్లుల ఓనర్లకు కాకుండా మిల్లులు లీజ్‌‌కు తీసుకున్న దళారులకు వడ్లు కేటాయించారు. వడ్లు అమ్ముకున్న దళారులు మిల్లుల లీజ్‌‌లు​ క్యాన్సిల్​చేసుకొని పత్తా లేకుండా పోయారు. వీరంతా ప్రభుత్వా నికి ఇయ్యాల్సిన బియ్యాన్ని బయట మార్కెట్‌‌లో, విదేశాల్లో అమ్ముకొని వందల కోట్లకు పడగెత్తారు. 

ఇలా వచ్చిన డబ్బును పలువురు మిల్లర్లు రియల్​ఎస్టేట్‌‌లో పెట్టుబడులు పెట్టి, భారీగా లాభాలు ఆర్జించారు. అటు కుటుంబసభ్యులు, బినామీల పేర్లతో స్థిర, చర ఆస్తులు కొనుగోలు చేశారు. గత ఫిబ్రవరిలో జరిగిన విజిలెన్స్​అండ్​ఎన్‌‌ఫోర్స్​దాడుల్లో పలువురు మిల్లర్ల దందాలు బయటపడ్డాయి. ఉదాహరణకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన ఒక మిల్లులో నిర్వహించిన తనిఖీల్లో  దాదాపు రూ.63 కోట్ల విలువైన సీఎంఆర్‌‌‌‌ ధాన్యం మాయమైనట్టు విజిలెన్స్ అధికారులు తేల్చారు. ఈ ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌‌లో అమ్ముకొని ఆ మొత్తంతో ఏపీ రాజధాని తూళ్లూరు వద్ద రియల్​ఎస్టేట్‌‌లో పెట్టుబడి పెట్టి,  20ఎకరాల్లో వెంచర్​వేసినట్టు గుర్తించారు.

 సర్కారుకు 200 కోట్ల బకాయి పెట్టి  సినిమా

గత బీఆర్ఎస్ హయాంలో సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఇమ్మిడి సోమ నర్సయ్య నాటి ప్రభుత్వ పెద్దల అండదండలతో చెలరేగిపోయాడు. ఆయనకు చెందిన సంతోషి మాతా, రఘురామ రైస్ మిల్లులకు కెపాసిటీ మించి కస్టమ్​ మిల్లింగ్​ ధాన్యా న్ని కేటాయించుకొని.. మరాడించిన బియ్యాన్ని  ప్రభుత్వానికి ఇవ్వకుండా పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 

2022–- 23, 2023–- 24 రబీ, ఖరీఫ్ సీజన్లలో మరాడించిన సుమారు రూ.500 కోట్ల బియ్యాన్ని విదేశాలకు తరలించి  సొమ్ము చేసుకున్నాడు. నాటి బీఆర్ఎస్​ ప్రభుత్వం ఆయన మీద ఈగ వాలనీయలేదు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  మంత్రి ఉత్తమ్​ ఆదేశాలతో సీఎంఆర్ ​ఇవ్వని మిల్లులపై అధికారులు దాడులు నిర్వహించగా, ఇమ్మిడి సోమ నర్సయ్యకు చెందిన రెండు మిల్లుల్లో 85,800  టన్నుల ధాన్యం మాయమైనట్టు గుర్తించారు.  

కట్టాల్సిన వడ్డీతో కలిపి ఈ మొత్తం రూ.200 కోట్లు దాటింది. అధికారులు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆస్తులను జప్తు  చేసేందుకు ప్రయత్నించగా గతేడాది ఆగస్టు నెలలో హైకోర్టు నుంచి స్టే ఆర్డర్​తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవలే రూ.10 కోట్ల బడ్జెట్‌‌తో సినిమా తీసిన సోమ నర్సయ్య, ఆ చిత్రం  ప్రమోషన్స్ కోసం బయటకు వచ్చి హంగామా చేయడం చర్చనీయాంశంగా మారింది.  ఈ వ్యవహారం కూడా ఈడీ దృష్టికి వచ్చినట్టు తెలిసింది. 

తాజా దాడుల్లోనూ మరిన్ని అక్రమాలు 

 గత వానాకాలం సీజన్‌‌లో రాష్ట్ర ప్రభుత్వం.. రైతుల నుంచి 72 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు కేటాయించింది. కేంద్రం కోటా, రాష్ట్ర అవసరాల కోసం నిల్వ ఉంచిన ధాన్యం పోగా.. మరో 12 లక్షల టన్నుల సన్నవడ్లు మిగిలాయి. ఇందులో తొలి విడత 5 లక్షల టన్నుల ధాన్యాన్ని 11 లాట్లుగా వేలం వేసేందుకు గ్లోబల్ ఈ–-టెండర్లను ఆహ్వానించింది. టన్ను వడ్లకు ప్రభుత్వం కనీస ధర రూ.34,050గా నిర్ణయించింది. 

కానీ టెండర్లలో పాల్గొన్న మిల్లర్లు, వ్యాపారులు టన్నుకు రూ.24 వేల నుంచి రూ.27 వేల ధర మాత్రమే కోట్ చేశారు. మిల్లర్లంతా కూడబలుక్కోవడంతో రూ.7 వేల నుంచి రూ.10 వేల తక్కువ రేటుకు బిడ్లు దాఖలయ్యాయి. దీనిపై అనుమానం రావడంతో సర్కార్‌‌‌‌.. మిల్లర్లపై విజిలెన్స్​ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ను రంగంలోకి దించింది. 

జులై 20 నుంచి సూర్యాపేట, మిర్యాలగూడ, నిజామాబాద్‌‌, నల్గొండ, మెదక్‌‌, వరంగల్‌‌ జిల్లాల్లోని రైస్ మిల్లుల్లో రెండు వారాలపాటు విజిలెన్స్​టీమ్‌‌లు తనిఖీలు చేపట్టాయి.  ఈ దఫా దాడుల్లో దాదాపు రూ.750 కోట్లు విలువ చేసే బియ్యం దారి మళ్లినట్టు గుర్తించిన విజిలెన్స్..​ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ డాక్యుమెంట్ల కోసం ఈడీ విజిలెన్స్‌‌కు లేఖ రాసినట్టు తెలిసింది.

మిల్లర్ల దందా ఇలా.. 

దారి మళ్లిన ధాన్యం: 59.95 లక్షల టన్నులు
మొత్తం విలువ: రూ.13,399.71 కోట్లు
ఇప్పటికే రికవరీ: రూ.6,768.97 కోట్లు
ఇంకా ప్రభుత్వానికి రావాల్సింది: రూ.6,630.74 కోట్లు
తాజా విజిలెన్స్ దాడుల్లో గుర్తించిన అక్రమాలు: సుమారు రూ.750 కోట్లు