సృష్టి ఫెర్టిలిటీ నిందితుల విచారణ..చంచల్‌‌గూడ జైల్లో ఈడీ ఎంక్వైరీ

సృష్టి ఫెర్టిలిటీ నిందితుల విచారణ..చంచల్‌‌గూడ జైల్లో ఈడీ ఎంక్వైరీ
  • డాక్టర్ నమ్రత సహా ముగ్గురిని ప్రశ్నించిన అధికారులు
  • ఈ నెల 28 వరకు విచారించేందుకు అనుమతించిన కోర్టు
  • 86 మంది పిల్లల ట్రాఫికింగ్‌‌.. రూ.40 కోట్లకు పైగా మనీలాండరింగ్‌‌

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్స్‌‌ కేసులో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఫెర్టిలిటీ సెంటర్‌‌‌‌ ద్వారా సంపాదించిన వందల కోట్లు, ఆస్తుల వివరాలను సేకరిస్తున్నది. ఇందులో భాగంగా ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రతతో పాటు కల్యాణి, నందిని, సంతోషిను బుధవారం విచారించింది. 

చంచల్‌‌గూడ విమెన్ జైలు రిమాండ్‌‌లో ఉన్న వీరిని ప్రశ్నించేందుకు ఈ నెల 28 వరకు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని ఆదేశించింది. ఈ మేరకు నిందితులకు మంగళవారం నోటీసులు ఇచ్చారు. బుధవారం ముగ్గురిని ప్రశ్నించారు. ఈ ముగ్గురితో పాటు నమ్రత కొడుకు జయంత కృష్ణను కూడా ప్రశ్నించనున్నారు. జయంత ప్రస్తుతం చంచల్‌‌గూడ మెన్‌‌ జైలు రిమాండ్‌‌లో ఉన్నాడు.

గత నెల 25న ఈడీ సోదాల్లో కీలక ఆధారాలు

పిల్లల్లేని దంపతులకు పసిపిల్లల విక్రయాలకు పాల్పడిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్‌‌ గోపాలపురం పోలీస్ స్టేషన్‌‌లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ కేసు రిజిస్టర్ చేసింది. సెప్టెంబర్‌‌ 25న‌‌ హైదరాబాద్‌‌లోని 5 ప్రాంతాల్లో, విజయవాడలోని 2 ప్రాంతాల్లో, విశాఖపట్నంలో 2 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను కొనుగోలు చేసి సరోగసీ పేరుతో రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు విక్రయించినట్లు గుర్తించింది. 

86 మందికి పైగా పిల్లల్ని చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్లు ఆధారాలు సేకరించింది. హైదరాబాద్ సహా 8 రాష్ట్రాల్లో సృష్టి కార్యకలాపాలు విస్తరించినట్లు ఈడీ దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో రూ.40 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు ఈడీకి ఆధారాలు లభించాయి. సోదాల్లో స్వాధీనం చేసుకున్న బ్యాంక్‌‌ అకౌంట్స్‌‌, ఆస్తుల వివరాల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ మేరకు నమ్రత సహా నిందితులను విచారిస్తున్నది.