- ఇప్పటికే రూ.161.5 కోట్లు జప్తు చేసిన ఈడీ
హైదరాబాద్, వెలుగు: సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఐవీఐపీఎల్) కేసు దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. ఎస్‌ఐవీఐపీఎల్ మాజీ డైరెక్టర్ సందు పూర్ణచంద్ర రావు, అతని కుటుంబ సభ్యులకు చెందిన రూ.12.65 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను జప్తు చేసింది.ఈ మేరకు హైదరాబాద్ జోనల్ కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ప్రీ లాంచింగ్ ఆఫర్లతో ఎస్‌ఐవీఐపీఎల్ ప్రమోటర్లు, డైరెక్టర్లు మోసగించారని ఆరోపిస్తూ కొనుగోలుదారులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఈడీ దర్యాప్తును ప్రారంభించింది.
రూ.842 కోట్లు దారిమళ్లించిన సాహితీ
ప్రీ లాంచ్ పేరుతో ఎస్‌ఐవీఐపీఎల్, ఇతర గ్రూప్ సంస్థలు మొత్తం రూ.842.15 కోట్లు దారిమళ్లించాయి. డిపాజిటర్లను మోసం చేశాయి. రూ.216.91 కోట్ల నగదును ఇన్వెస్టర్ల నుంచి సేకరించి, దానిని ఎస్‌ఐవీఐపీఎల్ ఖాతాల్లో ఉద్దేశపూర్వకంగానే చూపించలేదని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. సాహితీ ఎండీ లక్ష్మీనారాయణ, సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ హెడ్ అయిన సందు పూర్ణచంద్ర రావు, హోమ్ బయర్ల నిధులలో కొంత భాగాన్ని వారి వ్యక్తిగత, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు మళ్లించారని తేలింది.
ఈ సొమ్ముతో కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో స్థిరాస్తులను కొనుగోలు చేశారని ఈడీ ఆధారాలు సేకరించింది. ఎస్‌ఐవీఐపీఎల్ నుంచి రాజీనామా చేసిన తర్వాత పూర్ణచంద్ర రావు మనీలాండరింగ్ ద్వారా తన పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, సంబంధిత వ్యక్తులు, సంస్థల పేర్లతో కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులను కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. ఈడీ గతంలో లక్ష్మీనారాయణ, సందు పూర్ణచంద్ర రావు, ఇతరులకు చెందిన రూ.161.50 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ప్రస్తుతం వారిద్దరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
