ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించలేదు.. ప్రధాని మోదీ తీరుపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా విచారం

ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించలేదు.. ప్రధాని మోదీ తీరుపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా విచారం

ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ( పత్రికా సమావేశం) కూడా నిర్వహించకపోవడం విచారకరమైన వాస్తవం అని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (EGI) చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

మీడియా ప్రశ్నించడం పట్ల ప్రభుత్వానికి పెరుగుతున్న అసహనాన్ని ఎడిటర్స్ గిల్డ్ తీవ్రంగా విమర్శించింది. భారత అధికారులు, నార్వే, నెదర్లాండ్స్ జర్నలిస్టుల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ నార్వే రాజధాని పర్యటన అంతర్జాతీయ మీడియాలో రచ్చకు కారణమైన సంగతి తెలిసిందే.

నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్‌తో కలిసి నిర్వహించిన పత్రికా సమావేశం ముగిసిన తర్వాత.. ప్రధాని మోదీ అక్కడి నార్డిక్ జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి నిరాకరించారు. పత్రికా సమావేశం అనంతరం.. స్థానిక పాత్రికేయుల ప్రశ్నలను స్వీకరించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నిరాకరించడంతో యూరోపియన్ మీడియాతో ఈ ఘర్షణ మొదలైందని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా గుర్తుచేసింది.

►ALSO READ | ఏడాది లోగా మోదీ ప్రభుత్వం కూలిపోతుంది.. హాట్ టాపిక్గా రాహుల్ ప్రకటన

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ ర్యాంకింగ్‌లను ఎడిటర్స్ గిల్డ్ ప్రస్తావించింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో నార్వే, నెదర్లాండ్స్ వరుసగా మొదటి, రెండవ స్థానాల్లో ఉండగా.. 180 దేశాలలో ఇండియా దారుణంగా 157వ స్థానంలో ఉందని పేర్కొంది. ప్రధానమంత్రి తన పదవీ కాలంలో మీడియాతో ప్రత్యక్షంగా మమేకమవ్వకపోవడం పట్ల గిల్డ్ ఆందోళన వ్యక్తం చేసింది.

మీడియాపై ఆంక్షలు.. మన ఆర్థిక వ్యవస్థకు, మన సమాజానికి హాని కలిగిస్తాయని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా ఉంచడం అనే తన విధిని నిర్వర్తిస్తున్నందుకు మీడియాను శత్రువుగా పరిగణించడం మానుకోవాలని ప్రభుత్వానికి ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా హితవు పలికింది.