రూ.70 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యాశాఖ ఆఫీసర్లు

రూ.70 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యాశాఖ ఆఫీసర్లు

బషీర్‌‌బాగ్, వెలుగు: ఓ ఫైల్‌‌ను ప్రాసెస్ చేయడానికి రూ.70 వేల లంచం తీసుకుంటూ ఇద్దరు విద్యాశాఖ అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ వ్యక్తి తన స్కూల్​కు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన సీబీఎస్ఈ ఎన్ఓసీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ ఫైల్‌‌ను ప్రాసెస్ చేయడానికి హైదరాబాద్ సైఫాబాద్‌‌లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడల శ్రీధర్‌‌  రూ.70 వేల డిమాండ్ చేశాడు. 

సూపరింటెండెంట్‌‌తో మాట్లాడి ఎన్ఓసీ ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం డిమాండ్ చేసిన రూ.70 వేల నగదును సూపరింటెండెంట్ సంగీన ఫణిరాజ్​ సమక్షంలో సీనియర్ అసిస్టెంట్ స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు.