ఎఫ్‌‌‌‌ఎల్‌‌‌‌ఎన్ లక్ష్యసాధనలో నిర్లక్ష్యం వద్దు : విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా

ఎఫ్‌‌‌‌ఎల్‌‌‌‌ఎన్ లక్ష్యసాధనలో నిర్లక్ష్యం వద్దు :  విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా
  •  విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌‌‌‌ఎల్‌‌‌‌ఎన్) అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా అధికారులను హెచ్చరించారు. ‘బ్రీత్ ఎఫ్‌‌‌‌ఎల్‌‌‌‌ఎన్ – ప్రాక్టీస్ ఎఫ్‌‌‌‌ఎల్‌‌‌‌ఎన్’ అనే నినాదంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గురువారం ఉస్మానియా వర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంఈవోలు, డీఈవోలు, ఆర్జేడీలకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. యోగితారాణా మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి నుంచి వచ్చే ఆదేశాలను కింది స్థాయికి పాస్ చేయడం అధికారుల పని కాదని, ఎఫ్‌‌‌‌ఎల్‌‌‌‌ఎన్ గైడ్‌‌‌‌లైన్స్, రెమిడియల్ బోధనపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. 

ఎవరైనా బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తే ఊరుకోబోమని, పనితీరు సరిగా లేని జిల్లాలు, మండలాలపై సమీక్షిస్తామని హెచ్చరించారు. డీఈవోలు ప్రతి నెలా 12 ప్రైమరీ స్కూళ్లను సందర్శించాలని, అందులో ఆరు ఎఫ్‌‌‌‌ఎల్‌‌‌‌ఎన్ కాంపిటెంట్ స్కూల్స్ తప్పకుండా ఉండాలని చెప్పారు. ఆఫీసర్లు స్కూళ్లు తనిఖీ చేసినప్పుడు కనీసం మూడు గంటలు అక్కడే ఉండాలన్నారు. 45 నిమిషాల పాటు క్లాస్‌‌‌‌రూమ్ అబ్జర్వేషన్ చేయాలని, కేవలం ఐదు నిమిషాలు చూసి వెళ్తే అది అబ్జర్వేషన్ కిందకు రాదని తేల్చి చెప్పారు. 

ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థుల కోసం ప్రతిరోజూ ఒక గంట రెమిడియల్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణ పీజీఐ గ్రేడింగ్‌‌‌‌లో గతంలో రాష్ట్రం 28వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 18వ స్థానానికి చేరుకుందని గుర్తుచేశారు. వచ్చే ఏడాది నాటికి తెలంగాణను దేశంలోనే టాప్-10 రాష్ట్రాల్లో ఒకటిగా నిలపాలని, ఇందుకోసం అధికారులంతా కష్టపడి పనిచేయాలని సూచించారు. అనంతరం జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తమ జిల్లాల్లో ఎఫ్‌‌‌‌ఎల్‌‌‌‌ఎన్ అమలుకు చేపట్టిన విజయవంతమైన వ్యూహాలను వివరించారు. ఈ సమావేశంలో అడిషనల్ డైరెక్టర్లు శ్రీహరి, లింగయ్య, రమేశ్, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.