ఆకునూరి మురళి నివేదికను సవరించాలి.. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

ఆకునూరి మురళి నివేదికను సవరించాలి.. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

పంజాగుట్ట, వెలుగు: తెలంగాణ కొత్త విద్యా చట్టానికి మరిన్ని సవరణలు అవసరమని, అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని విద్యావేత్తలు, వక్తలు అభిప్రాయపడ్డారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో స్పీక్ సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్ గోపాలన్ విద్యాసాగర్ అధ్యక్షతన విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీలు మోహన్ రెడ్డి, నర్సిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు సంస్థలకే ప్రజలు మొగ్గు చూపడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయుల వేతనాలపై విమర్శలు చేయడం మానుకొని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆకునూరి మురళి కమిటీ ఇచ్చిన నివేదికకు మరిన్ని సవరణలు చేసి, ఉత్తమ విద్యాచట్టాన్ని తీసుకువచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, లక్ష్మణ్, రమేశ్ రెడ్డి, బీసీ విద్యార్థి సంఘం నాయకుడు విక్రమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.