- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మధిర, వెలుగు : పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ ప్రకారం ముందుకు పోతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని తొమ్మిదో వార్డులో బుధవారం తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2047 కల్లా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు క్యూర్ ప్యూర్, రేర్ కోర్ అర్బన్, ఫెరీ అర్బన్, రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ విభాగాలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోతున్నామన్నారు. తెలంగాణలో గాలి నాణ్యతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పట్టణాల్లో మురుగునీటిని శుభ్రం చేసేందుకు పెద్ద సంఖ్యలో ఎస్టీపీలను నిర్మాణం చేస్తున్నామన్నారు. చెరువులకు ఆక్రమణదారుల నుంచి విముక్తి కల్పించి టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
రెప్పపాటు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని, పేదలకు ఆసరాగా ఉండాలన్న ఉద్దేశంతో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లు చెప్పారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే గ్రామీణ యువత కోసం నియోజకవర్గ కేంద్రాల్లోనే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పేద విద్యార్థులకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో విద్యను అందించేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు.
