- ఒకరిని రక్షించే ప్రయత్నంలో మరొకరు కొట్టుకుపోయిన వైనం
- మృతుల్లో ఏడుగురు మహిళలు.. మరో ఇద్దరు గల్లంతు
బెంగళూరు: కర్నాటకలోని తత్తెహక్కల నదిలో ఆల్చిప్పల కోసం దిగిన ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఏడుగురు మహిళలేనని పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకుని జాలర్లతో కలిసి సహాయాక చర్యలు చేపట్టామని వివరించారు.
నీళ్లలో కొట్టుకుపోతున్న వారిని ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేశామని, అయితే ఇద్దరిని మాత్రమే కాపాడగలిగామని తెలిపారు. సాయంత్రానికి ఎనిమిది మృతదేహాలను ఒడ్డుకు చేర్చామని, నీళ్లలో గల్లంతైన మిగతా వారి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.
ఆల్చిప్పల సేకరణకు వెళ్లి..
భత్కల్ తాలూకా శిరాలీ గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు 14 మంది ఆదివారం ఆల్చిప్పల సేకరణ కోసం తత్తెహక్కల నదికి వెళ్లారు. అందరూ నదిలో దిగి ఆల్చిప్పలు ఏరుకుంటూ లోపలికి వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాలకు నదిలో నీటి ప్రవాహం పెరిగింది.. ఇది గుర్తించక నది లోపలికి వెళ్లడంతో వారిలో ఇద్దరు ప్రవాహంలో పడి కొట్టుకుపోయారు. వారిని రక్షించేందుకు మిగిలిన వారు కూడా వెళ్లారు. అయితే, ప్రవాహ ఉధృతి కారణంగా వారంతా కొట్టుకుపోయారు.
సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది, పోలీసులు, స్థానికులు వెంటనే రంగంలోకి దిగి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఎనిమిది మంది మృతదేహాలను వెలికితీశారు. ప్రాణాలతో బయటపడిన ఇద్దరిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన మరో ఇద్దరి కోసం నదిలో తీవ్రంగా గాలిస్తున్నారు.
ఈ ఘటనపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు.
