అంజనీ కుమార్​పై సస్పెన్షన్​ ఎత్తివేత

అంజనీ కుమార్​పై  సస్పెన్షన్​ ఎత్తివేత
  • రేవంత్​ పిలిస్తేనే వెళ్లానని ఈసీకి మాజీ డీజీపీ వివరణ
  • డీజీపీ కాకుండా వేరే పోస్టు ఇచ్చే యోచనలో రాష్ట్ర సర్కార్​

హైదరాబాద్, వెలుగు: మాజీ డీజీపీ అంజనీ కుమార్‌‌పై  కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్‌‌ ఎత్తివేసింది. ఈ మేరకు సీఎస్ ​శాంతి కుమారికి మంగళవారం లేఖ పంపింది. ఈ నెల 3న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగియక ముందే కోడ్​అమల్లో ఉండగా పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌‌ రెడ్డిని అప్పటి డీజీపీ అంజనీ కుమార్‌‌, అదనపు డీజీ సంజయ్‌‌ కుమార్‌‌, మహేశ్‌‌ భగవత్‌‌ కలిశారు. దీంతో ఎన్నికల కోడ్‌‌ ఉల్లంఘించారని అంజనీ కుమార్‌‌ను సస్పెండ్‌‌ చేయగా, మిగిలిన ఇద్దరు ఐపీఎస్‌‌ అధికారులకు ఈసీ షోకాజ్​ జారీ చేసింది. తాను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్​ను ఉల్లంఘించలేదని ఈసీకి అంజనీ కుమార్​ తెలిపారు.

రేవంత్‌‌ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని చెప్పారు. ఇలాంటి ఘటన రిపీట్​ కాదని వివరణ ఇచ్చారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. సస్పెన్షన్‌‌ ఎత్తివేసింది. మరోవైపు అంజనీ కుమార్​కు డీజీపీ పోస్టు ఇచ్చే అవకాశం లేదని తెలిసింది. ఎన్నికలకు సంబంధించి ఈసీ సస్పెండ్​ చేయడంతో మళ్లీ రెండు నెలల్లో పార్లమెంట్​ ఎలక్షన్స్​ షెడ్యూల్​ వస్తే.. అప్పుడు కూడా ఆయన్ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఏపీ క్యాడర్​కు చెందిన అంజనీకుమార్​పై హైకోర్టులో కేసు విచారణలో ఉంది. ఏ క్షణమైనా ఆయనను ఏపీకి పంపే అవకాశం కూడా ఉంది. దీంతో ఆయన్ను టీఎస్​పీఎఫ్ లేదంటే టీఎస్​ఎస్​పీకి డీజీగా నియమించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతున్నది.