కరోనా కేసుల్లో ఓట్ల వేట

కరోనా కేసుల్లో ఓట్ల వేట

హైదరాబాద్: ఒకవైపు కరోనా కేసులు జోరుగా పెరుగుతుంటే.. మరో వైపు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల వేట ఆగడం లేదు. ఎన్నికలు వాయిదా వేయడం లేదని.. యధాతథంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలా ? వద్దా ? అనే దానిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి గురువారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. 
గ్లాస్ చాంబర్ లో ఉండి.. అధికారులతో మాట్లాడారు. హాజరైన అధికారులు కూడా పదిమంది లోపే ఉన్నారు. క్షేత్ర స్థాయిలో చూస్తే... మున్సిపల్ ఎన్నికల్లో  పార్టీల ప్రచారం ఉంటుంది. బహిరంగ సభలు పెడితే వేలల్లో హాజరవుతారు. అలా కాదని రోడ్డు షోలు నిర్వహించినా.. జనం గుంపులు గుంపులుగా గుమిగూడుతారు. ఇవేవీ కాదని కనీసం ఇంటింటి ప్రచారం చేసినా.. ఇళ్లిళ్లూ ప్రచారానికి తిరిగే వారికి.. వారి వచ్చి వెళ్లడం వల్ల ఇళ్లలో ఉండే వారికి కరోనా నుండి  రక్షణ ఎలా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చివరగా పోలింగ్ జరిగినా ఓటర్లు వేల సంఖ్యలో బారులు తీరుతారు. వారితో సోషల్ డిస్టెన్స్ నిర్వహించడం కత్తిమీద సామే. ఎందుకంటే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో, చివరకు రైళ్లు, బస్సుల్లో కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్న దాఖలాలు అంతంత మాత్రమే. ఈ క్రమంలో భయాందోళన కలిగిస్తున్న కరోనా సెకండ్ వేవ్ ను కట్టడి చేయడం సాధ్యమేనా.. ఏ మేరకు చర్యలు తీసుకుంటారని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.