ఎలక్షన్ల సర్వే ఏజెన్సీలనూ వదల్లే!..ఫోన్‌ ట్యాపింగ్‌ లిస్టులో ఆరా, పీపుల్స్ పల్స్‌

ఎలక్షన్ల సర్వే ఏజెన్సీలనూ వదల్లే!..ఫోన్‌ ట్యాపింగ్‌ లిస్టులో ఆరా, పీపుల్స్ పల్స్‌

హైదరాబాద్‌, వెలుగు: ఉప ఎన్నికలు సహా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్ గెలుపోటములు సహా ఇతర పార్టీల బలాబలాలపై సర్వేలు చేసిన ఆరా, పీపుల్స్ పల్స్ మరికొన్ని సర్వే సంస్థల నిర్వాహకుల ఫోన్‌ నంబర్లను కూడా ప్రభాకర్‌‌ రావు టీమ్‌ ట్యాపింగ్‌ చేసినట్టు సిట్ తాజాగా గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్‌ లిస్ట్‌ ఆధారంగా ఆయా సంస్థల ప్రతినిధుల స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తోంది. ఇందులో భాగంగా పీపుల్స్ పల్స్‌ నిర్వాహకుడు రవిచంద్ర స్టేట్‌మెంట్‌ను ఇప్పటికే రికార్డ్ చేయగా.. ప్రముఖ సెఫాలజిస్ట్ ‘ఆరా’ మస్తాన్‌ బుధవారం సిట్‌ విచారణకు హాజరయ్యారు.

ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌‌, జూబ్లీహిల్స్‌ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో ఆయన స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. ప్రధానంగా మునుగోడు, హుజూరాబాద్‌ ఉన్న ఎన్నికలు సహా 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వినియోగించిన రెండు ఫోన్‌ నంబర్ల గురించి అడిగి తెలుసుకున్నారు. సర్వేల సమయంలో ఎదుర్కొన్న సమస్యలు, అనుమానిత కాల్స్, ఏమైనా వ్యక్తిగత విషయాలు బహిర్గతం అయ్యాయా? అనే కోణంలో వివరాలు సేకరించారు.