
- ప్రతి నాలుగైదు నెలలకోసారి ఎలక్షన్లతో అభివృద్ధికి ఆటంకం
- వన్ నేషన్, వన్ ఎలక్షన్ సదస్సులో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ కామెంట్
హైదరాబాద్, వెలుగు: దేశంలో ప్రతి నాలుగైదు నెలలకోసారి ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరగుతుండటంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. అంతేకాకుండా భారీగా ఆర్థిక నష్టంతో పాటు సమయం కూడా వృథా అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఐదేండ్లకు ఒకేసారి అన్ని ఎన్నికలు జరగాలని, దీంతో డబ్బు, టైమ్ ఆదా అవుతుందన్నారు. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ అనే అంశంపై ఆదివారం హైదరాబాద్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ వర్చువల్ గా పాల్గొని మాట్లాడారు. 1951-, 52లో జరిగిన లోక్ సభ ఎన్నికలకు రూ.11 వేల కోట్లు ఖర్చు అయిందని, 2019 లోక్‌సభ ఎన్నికలకు రూ.60 వేల కోట్లు అయిందని ఆయన తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఏకంగా రూ.1.35 లక్షల కోట్లు ఖర్చయిందని వివరించారు.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి జరిపితే ఖర్చు సగానికి పైగా తగ్గుతుందని, సమయం కూడా ఆదా అవుతుందని అభిప్రాయపడ్డారు. దేశానికి హానిచేసే వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 76 ఏండ్లు పూర్తయినా ఇంకా బ్రిటిష్ వారి విధానాల్ని అవలంబిస్తున్నామన్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ గురించి ప్రజల్లో చైతన్య నింపాల్సిన అవసరం ఉందన్నారు.