ఇంధన సంక్షోభానికి ఎలక్ట్రిక్ పరిష్కారం

ఇంధన సంక్షోభానికి ఎలక్ట్రిక్ పరిష్కారం

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, సరఫరా గొలుసులో  ఆటంకాల వల్ల  పెట్రోల్, డీజిల్, సి.ఎన్.జి ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో ఇటీవల కనిపిస్తున్న ఇంధన కొరత  సంకేతాలు, పెట్రోల్​ బంకుల వద్ద బారులు తీరుతున్న వాహనాలు మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నాయి. ‘మనం ఇంకా శిలాజ ఇంధనాలపైనే ఆధారపడాలా?’ ఈ ఇంధన సంక్షోభానికి శాశ్వత విరుగుడుగా ఎలక్ట్రిక్ వాహనాలే (ఈవీ) సరైన పరిష్కారమని చెప్పాలి.

ఈవీలతో ఇంధన సంక్షోభ పరిష్కారం

ఎలక్ట్రిక్​ వాహనాల సాంకేతిక సామర్థ్యం: ఒక ఈవీ డిజైన్ నిపుణుడిగా,  నేను  గమనించిన  ప్రధాన అంశం 'ఎనర్జీ ఎఫిషియన్సీ'.  సాధారణ  పెట్రోల్ ఇంజిన్లు కేవలం 20%  ఇంధనాన్ని మాత్రమే  గమన శక్తిగా మారుస్తాయి. అదే ఎలక్ట్రిక్  మోటార్లు 60% పైగా సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

నిర్వహణ ఖర్చు: హైదరాబాద్​లో ప్రస్తుతం పెట్రోల్  ధర   లీటరుకు  సుమారు రూ.107,  డీజిల్ రూ. 95 పైనే ఉంది.  అదే ఎలక్ట్రిక్ వాహనానికి   కిలోమీటరుకు కేవలం  రూ.1.50  నుంచి  రూ. 2 మాత్రమే  ఖర్చవుతుంది.

మెయింటెనెన్స్ : ఇంజిన్ ఆయిల్ మార్పులు,  ఫిల్టర్లు,  గేర్ బాక్స్ వంటి  వందలాది  కదిలే  భాగాలు లేకపోవడం వల్ల  సర్వీసింగ్  ఖర్చులు 70%  వరకు  తగ్గుతాయి. 

ప్రభుత్వ ప్రోత్సాహకాలు

పీఎం ఈ డ్రైవ్:  కేంద్ర ప్రభుత్వం రూ.10,900 కోట్లతో నూతన  'పీఎం ఈ-డ్రైవ్'  పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా ఎలక్ట్రిక్  ద్విచక్ర వాహనాలపై కిలోవాట్ అవర్ (kWh)కు  రూ.2,500 చొప్పు న, గరిష్టంగా  రూ. 5,000 వరకు నేరుగా సబ్సిడీ ఇస్తుంది.

తెలంగాణ రాష్ట్ర ఈవీ పాలసీ 2026 ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే  అత్యంత  ఆకర్షణీయమైన రాయితీలను అందిస్తోంది.  100%  మినహాయింపు లభిస్తోంది. ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్  ఫీజు, రోడ్డు టాక్స్ నుంచి  పూర్తి మినహాయింపు లభిస్తోంది. ఇది వాహన ధరపై వేల రూపాయల ఆదాను ఇస్తుంది. 

ప్రభుత్వ ఉద్యోగులకు  ప్రత్యేక రాయితీ లభిస్తోంది.   దేశంలోనే  తొలిసారిగా తెలంగాణ  ప్రభుత్వం  ప్రముఖ ఈవీ తయారీ సంస్థలు ( ఓలా, ఆథర్, మహీంద్రా తదితర సంస్థలు)తో  చర్చలు జరిపి,    ప్రభుత్వ  ఉద్యోగులకు వాహన ధరపై 10%  నుంచి  20% వరకు ప్రత్యేక  డిస్కౌంట్లను  ఖరారు  చేస్తుంది.  దీనివల్ల  ఉద్యోగులకు  సుమారు రూ.4 లక్షల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. 

చార్జింగ్ నెట్​వర్క్​
హైదరాబాద్  అంతటా అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో  కూడా  ఫాస్ట్  చార్జింగ్  స్టేషన్ల ఏర్పాటు  వేగవంతమైంది. సెక్రటేరియట్ నుంచి మండల స్థాయి కార్యాలయాల వరకు చార్జింగ్ పాయింట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. భద్రత, రేంజ్​పై అవగాహన కలిపిస్తోంది.   చాలామందికి  బ్యాటరీ  భద్రతపై ఆందోళన ఉంటుంది. అయితే,  ఇప్పుడు  వస్తున్న బ్యా టరీలు  AIS-156 ప్రమాణాలతో, మన దేశ ఉష్ణోగ్రతలను  తట్టుకునేలా  రూపుదిద్దుకుంటున్నా యి.

ఓవర్  -టెంపరేచర్  ప్రొటెక్షన్, అడ్వాన్స్​డ్  కూలింగ్  సిస్టమ్స్ వల్ల  ఈ వాహనాలు పెట్రోల్ వాహనాల కంటే సురక్షితమైనవి.  ఒక్కసారి చార్జ్ చేస్తే 300 నుంచి 400 కిలోమీటర్లు ప్రయాణించే  వాహనాలు ఇప్పుడు మార్కెట్లో  సామాన్యుడికి  అందుబాటు ధరలో ఉన్నాయి. పెట్రోల్ బంకుల వద్ద  గంటల కొద్దీ వేచి ఉండటం కంటే,  రాత్రి పూట ఇంట్లోనే  మన  వాహనాన్ని చార్జ్ చేసుకోవడం ఎంతో సౌకర్యవంతం. ఐఐటి  వంటి  ఉన్నత  సంస్థల  పరిశోధనలు, ప్రభుత్వ రాయితీలు ఈ మార్పును సులభతరం  చేస్తున్నాయి.  కాలుష్య రహిత,  ఆర్థిక స్వయం సమృద్ధి  కలిగిన భవిష్యత్తు వైపు అడుగులు వేయాల్సిన సమయం ఇదే.  

కోటమర్తి  చైతన్యకుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్

* ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ openpage@v6velugu.com
* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
* రచన 700 పదాలకు మించరాదు.