పేపర్ల లీకేజీ కేసు.. ఎలక్ట్రిసిటీ డీఈ అరెస్టు

పేపర్ల లీకేజీ కేసు.. ఎలక్ట్రిసిటీ డీఈ అరెస్టు

 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  టీఎస్‌‌‌‌ పీఎస్‌‌‌‌సీ పేపర్ల లీకేజీ కేసులో తవ్విన కొద్దీ లీకుల లింకులు బయటపడుతున్నాయి. అసిస్టెంట్‌‌‌‌ ఇంజనీర్ (ఏఈ) పేపర్‌‌‌‌‌‌‌‌  లీకేజీ కేసులో వరంగల్‌‌‌‌ ఎలక్ట్రిసిటీ డివిజనల్ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌ (డీఈ) రమేశ్ ను సిట్‌‌‌‌ శనివారం అరెస్టు చేసింది. ఆయనను కోర్డులో హాజరుపరచగా కోర్టు రిమాండ్‌‌‌‌కు తరలించింది. నిందితుడి వద్ద ఏఈ పేపర్లను కొనుగోలు చేసిన నలుగురు అభ్యర్థులను సిట్  అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిని ఆదివారం జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్‌‌‌‌కు తరలించనున్నారు. రమేశ్  ద్వారా 20 మందికి పైగా ఏఈ పేపర్‌‌‌‌‌‌‌‌ చేతులు మారినట్లు అధికారులు గుర్తించారు. వారిలో మరో 10 మందిని అరెస్టు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఈ పరీక్ష రాసిన సతీష్​ కుమార్​ను​ శుక్రవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరితో కలిపి నిందితుల సంఖ్య 46కు చేరింది. వారిలో అధికారులు 45 మందిని అరెస్టు చేశారు.

అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ అడ్డాగా పేపర్  లీక్‌‌‌‌

వరంగల్‌‌‌‌కు చెందిన రమేశ్.. హైదరాబాద్​ సైదాబాద్‌‌‌‌లోని ఓ అపార్ట్​మెంట్​లో నివాసం ఉంటున్నాడు. అదే అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో అతని బంధువు పూల రవికిశోర్‌‌‌‌‌‌‌‌, బావమరిది విక్రమ్‌‌‌‌, మరదలు దివ్య కూడా ఉంటున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌‌‌‌లోని టీఎస్‌‌‌‌ ఎస్పీడీసీఎల్ లో రవికిశోర్  జూనియర్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. వారంతా నివాసం ఉండే అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లోనే పేపర్  లీకేజీ కేసు నిందితుడు సురేశ్  కూడా నివాసం ఉండేవాడు. ప్రవీణ్, రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ద్వారా లీకయిన ఏఈ, డీఏఓ పేపర్లను రమేశ్, రవికిశోర్‌‌‌‌‌‌‌‌ కొన్నారు. విక్రమ్‌‌‌‌, దివ్య డీఏవో పరీక్ష రాశారు. వారితో పాటు ఉప్పల్‌‌‌‌కు చెందిన భరత్‌‌‌‌ నాయక్‌‌‌‌, వరంగల్‌‌‌‌కు చెందిన పసికంటి రోహిత్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, గాదె సాయిమధు, లొకిన్  సతీశ్ కుమార్‌‌‌‌  ఏఈ పేపర్లు కొని పరీక్ష రాశారు. వారందరినీ సిట్‌‌‌‌  అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌‌‌‌కు తరలించారు.

జిరాక్స్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌లో ఏఈ మాస్టర్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌

రమేశ్  ఎలక్ట్రికల్‌‌‌‌  డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో డీఈగా పనిచేస్తూనే టీఎస్‌‌‌‌ పీఎస్‌‌‌‌సీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ట్రైనింగ్‌‌‌‌ ఇచ్చాడు. ఈ క్రమంలోనే 20 మందికి పైగా అభ్యర్థులు రమేశ్ తో కాంటాక్టులో ఉండేవారు. ఏఈ పరీక్షకు రెండు రోజుల ముందు మాస్టర్‌‌‌‌‌‌‌‌  పేపర్‌‌‌‌‌‌‌‌  సురేశ్  చేతికి అందిందిది. ఈ పేపర్‌‌‌‌‌‌‌‌ను రమేశ్, రవికిశోర్‌‌‌‌ అమ్మేందుకు ప్లాన్ చేశారు. సైదాబాద్‌‌‌‌లోని ఓ జిరాక్స్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో పేపర్లు జిరాక్స్ తీసుకున్నారు. వాటిని రవికిశోర్‌‌‌‌‌‌‌‌, రమేశ్  కాంటాక్టుల లిస్టులో ఉన్న అభ్యర్థులకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల చొప్పున విక్రయించారు. రమేశ్  దాదాపు 20 మందికి పైగా ఏఈ పేపర్  విక్రయించాడు. ఈ క్రమంలోనే రవికిశోర్ కూడా ఏఈ, డీఏఓ పేపర్లను అమ్మాడు.

అనుమానితులకు మళ్లీ పరీక్ష

పేపర్  లీక్  చేసి పరీక్షలు రాసిన అనుమానితులను సిట్‌‌‌‌  అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పేపర్లు కొనుగోలు చేసి పరీక్షలు రాసిన వారికి మళ్లీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. మాస్టర్  పేపర్ ఇచ్చి పరీక్ష రాయిస్తున్నారు. పోలీసుల సమక్షంలో పరీక్షలు రాసిన అభ్యర్థులు కనీసం ఐదు ప్రశ్నలకు కూడా సమాధానాలు రాయలేని పరిస్థితిలో ఉన్నట్లు సిట్  అధికారులు గుర్తించారు. అలాంటి వారికి 100కు పైగా మార్కులు రావడంపై అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. పేపర్  లీకేజీ విషయం బయటపడ్డ తరువాత కొంత మంది అభ్యర్థులు నేరం అంగీకరిస్తున్నారు.