- గోడౌన్లలోనే 1.50 లక్షల టన్నుల నిల్వలు
- కొనుగోళ్లు లేక, కేంద్ర సబ్సిడీ రాక ఆర్థిక ఇబ్బందుల్లో ప్లాంట్
- ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లోనూ మరో లక్ష టన్నుల నిల్వలు
గోదావరిఖని, వెలుగు : ఎల్-నినో ప్రభావం రామగుండం ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)పై కూడా తీవ్రంగానే చూపుతోంది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వ్యవసాయ పనులు ప్రారంభం కాలేదు. బావుల ద్వారా సాగు నీరు అందే చోట మాత్రమే వరి నాట్లు వేశారు. మిగతా ప్రాంతాల్లో పనులు జరగకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా యూరియా డిమాండ్ గణనీయంగా తగ్గిపోయింది.
మార్క్ ఫెడ్ గోడౌన్లలో 1.50 లక్షల టన్నులు
తెలంగాణలో ఏకైక యూరియా ప్లాంట్అయిన ఆర్ఎఫ్సీఎల్నుంచి ఎరువుల ఉత్పత్తి కొనసాగుతూనే ఉంది. ఖరీఫ్ అవసరాల దృష్ట్యా ఏప్రిల్, మే నెలల్లో 65 వేల టన్నుల చొప్పున, జూన్‌లో 55 వేల టన్నుల యూరియాను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు.
జులై నెలలో 45 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించగా, ఇటీవల ప్లాంట్లో ఏర్పడిన సాంకేతిక కారణాల వల్ల ఈ నెలలో ఇప్పటివరకు 10 వేల టన్నుల యూరియా ఉత్పత్తి మాత్రమే జరిగింది. ఇంకా మిగిలిన 11 రోజుల్లో నిర్దేశిత ఉత్పత్తిని సాధించేందుకు మేనేజ్మెంట్ చర్యలు చేపట్టింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఆర్ ఎఫ్ సీఎల్ కు చెందిన సుమారు 2.50 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉండగా... ఇప్పటివరకు కేవలం లక్ష టన్నుల యూరియాను మాత్రమే రైతులు కొనుగోలు చేశారు.
దీంతో ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి సప్లై చేసిన మిగిలిన యూరియా మార్క్‌ఫెడ్ గోడౌన్లలోనే ఉండిపోయింది. డీలర్లు కూడా గోడౌన్ల నుంచి యూరియాను తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో రాబోయే రోజుల్లో ప్లాంట్ లో యూరియా ఉత్పత్తి చేస్తారా ? లేక షట్ డౌన్ చేస్తారా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
సబ్సిడీ సొమ్ము రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు
యూరియా వినియోగం తగ్గడం వల్ల ఆర్‌ఎఫ్‌సీఎల్ ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్లాంట్ కు అవసరమైన గ్యాస్కొనుగోలు, విద్యుత్, వాటర్బిల్లుల చెల్లింపులు, ఆఫీస్నిర్వహణ ఖర్చు, వేతనాలు, రుణాలకు వడ్డీ చెల్లింపులు... ఇలా వివిధ రకాలుగా ప్రతినెలా దాదాపు రూ.500 కోట్ల ఖర్చు అవుతుంది.
ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్లో 45 కిలోల యూరియా బ్యాగ్ తయారీకి సుమారు రూ.2,500 ఖర్చవుతుండగా, రైతులకు మాత్రం రూ.266.50కే అందిస్తున్నారు. మిగిలిన రూ.2,234ను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో చెల్లిస్తోంది.
రైతులు యూరియాను కొనుగోలు చేసిన తర్వాత నమోదయ్యే పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి సబ్సిడీని ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు విడుదల చేస్తుంది. ప్రస్తుతం యూరియా గోడౌన్లలోనే నిల్వ ఉండిపోవడంతో పీవోఎస్ నమోదులు తగ్గిపోయాయి. దీంతో సబ్సిడీ విడుదలలో జాప్యం జరిగి, ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
మరో ఐదు రాష్ట్రాల్లోనూ లక్ష టన్నుల నిల్వలు
ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి యూరియా సరఫరా అయ్యే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోను యూరియా నిల్వలు పేరుకుపోయాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి సుమారు లక్ష టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఆయా రాష్ట్రాలు యూరియా కొనుగోళ్లకు సంబంధించిన నిధులు విడుదల చేయడానికి నెలల పాటు సమయం తీసుకుంటుండడంతో ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు ఆర్థిక కష్టాలు తరుముకొస్తున్నాయి.
