- శతాధిక గ్రంథ రచయితగా గుర్తింపు
- బాల సాహిత్యంలో విశేషమైన కృషి
కరీంనగర్, వెలుగు : ప్రముఖ హేతువాది, చరిత్ర పరిశోధకుడు, సాహితీవేత్త మలయశ్రీ (86) శుక్రవారం రాత్రి కరీంనగర్‌లో కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయనను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్లకు చెందిన ఆయన ప్రభుత్వ లెక్చరర్‌గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. హేతువాద ఆలోచనలు కలిగిన ఆయన బౌద్ధాన్ని అనుసరించారు. శతాధిక గ్రంథ రచయితగా పేరున్న మలయశ్రీ ‘వెయ్యేండ్ల కరీంనగర్ జిల్లా సాహిత్యం’పై సాధికారిక పరిశోధన చేసి పీహెచ్‌డీ పొందారు. పిల్లల కోసం రంగుల పిట్టలు, సరదా కథలు, బంగారు బొమ్మలు, చుక్కల లోకం లాంటి 26 పుస్తకాలు రాశారు.
బాలసాహిత్యంతో పాటు 8 కథా సంపుటాలు, 26 నవలలు, 3 వ్యాస సంపుటాలు, 10 కవితా సంపుటాలు, 5 నృత్య నాటికలు, 7 నాటకాలు, 4 హాస్య గీతికలు, 2 బుర్రకథలు, పలు చారిత్రక గ్రంథాలు వెలువరించారు. ఇవేకాక వివిధ పత్రికల్లో వెయ్యి వరకు వ్యాసాలు రాశారు. సాహిత్యంలో కాకతీయుల ఆనవాళ్లను, నాటి సాంఘిక జీవనాన్ని శోధించారు. ‘తొలి తెలుగు చక్రవర్తులు’ పేరిట రుద్రదేవ, గణపతిదేవ, మహారాణి రుద్రమదేవి, ప్రతాపరుద్ర చక్రవర్తి నాటకాలకు ప్రాణం పోశారు. ఆయన రచించిన ‘శాంతిపథం’ పుస్తకం కొంతకాలం ఇంటర్మీడియట్ పాఠ్యగ్రంథంగా ఉంది. రెండు సార్లు ఉత్తమ తెలుగు ఉపాధ్యాయుడి పురస్కారాలతోపాటు లెక్కకు మించి అవార్డులు, రివార్డులు అందుకున్నారు. నవ్యసాహిత్య పరిషత్‌న స్థాపించి ప్రగతిశీల రచయితలకు ప్రతి ఏటా మలయశ్రీ సాహితీ అవార్డు అందజేస్తున్నారు.
