
- జూన్ 9న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా
- ప్రభుత్వం స్పందించకపోతే పెన్ డౌన్లు, మానవహారాలు
- తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటన
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర ఏడాది కావస్తున్నా పెండింగ్ సమస్యలను నేటికీ పరిష్కరించకపోవడంపై నిరసనకు దిగారు. ఆదివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, టీచర్లు, కార్మికులు, పెన్షనర్స్ ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అధ్యక్షతన జరిగిన సదస్సులో అందరి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్న అనంతరం ప్రభుత్వంపై ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. మే15న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు చేయనున్నట్లు తెలిపారు. జూన్ 9న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టాలని నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే పనివేళల్లో మాత్రమే పనిచేయడం, ప్రభుత్వ కార్యాలయం నుంచి మానవహారాలు, సాముహిక భోజనాలు చేయడం, పెన్ డౌన్, మూకుమ్మడి సెలవులు వంటి ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఉద్యోగుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమం ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసి సమస్యలు పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ బిల్లుల క్లియరెన్స్, ఐదు పెండింగ్డీఏల విడుదలతోపాటు ఉద్యోగుల ఆరోగ్య రక్షణ పథకం (ఈహెచ్ఎస్) పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్చేశారు. అలాగే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని, వేతన సవరణ కమిషన్ నివేదికను 51% ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలన్నారు. స్థానికత ఆధారంగా అదనపు పోస్టుల సృష్టించి జీవో 317 అమలు చేయాలని కోరారు. అన్ని శాఖల్లో సకాలంలో పదోన్నతులు ఇవ్వాలన్నారు. సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు, అదనపు కార్యదర్శి పి. దామోదర్ రెడ్డి, చావా రవి, రవీందర్ రెడ్డి, జి. సదానందం గౌడ్, దాస్య నాయక్, తిరుపతి, ఎస్ఏ హుసేని, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.