ఉద్యోగులు ప్రభుత్వంతో స్నేహితంగా మెలగాలి. లేదంటే..

ఉద్యోగులు ప్రభుత్వంతో స్నేహితంగా మెలగాలి. లేదంటే..

హైదరాబాద్: ఉద్యోగులు ప్రభుత్వంతో సఖ్యతతో వ్యవహరిస్తే మంచిదని, బెదిరించి పనులు చేసుకోవాలంటే  మాత్రం భయపడే స్థితిలో ప్రభుత్వం లేదని మంత్రి  శ్రీనివాస్ గౌడ్ రెవెన్యూ ఉద్యోగులకు చురకలు అంటించారు. రెవెన్యు శాఖపై ప్రజల్లో ఉన్న దురుద్దేశాన్ని తొలగించే విధంగా ఉద్యోగులు కష్టపడి పని చెయ్యాలని ఆయన కోరారు.  నాంపల్లి లోని ఇందిరా ప్రియదర్శని ఆడిటోరియంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్ష , కార్యదర్శులు శివశంకర్ నారాయణరెడ్డి పదవీ విరమణ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల అండ ఉందని ,దాని వల్లనే రెండోసారి అధికారంలో వచ్చామని అన్నారు.

తమ పాలనకు ఎన్నికలే కొలమానం అని … ప్రజాభీష్టం మేరకే పాలన కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. కొంత మంది ఉద్యోగ సంఘ నాయకుల ప్రకటనల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని , ఉద్యోగులు ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా మెలగాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అన్ని విషయాలు తెలుసని , సరైన సమయంలో రెవెన్యూ శాఖపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఈ విషయంపై  ఉద్యోగులు ఎవరు అధైర్యపడవద్దని , టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.