వందలాది ఉద్యోగులకు ఒకటే లిఫ్ట్​

వందలాది ఉద్యోగులకు ఒకటే లిఫ్ట్​

హైదరాబాద్, వెలుగుతాత్కాలిక సెక్రటేరియెట్  బీఆర్కే భవన్​లో రిపేర్ల కారణంగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు రెండు నెలల నుంచి కొనసాగుతున్న  భవన్​ మరమ్మతులు ఇప్పటికీ పూర్తి కాలేదు. పూర్తి కావటానికి దసరా వరకు సమయం పట్టవచ్చని అధికారులు అంటున్నారు.

ఉద్యోగులందరికీ ఒకటే లిఫ్టు

బీఆర్కే భవన్​లో మొత్తం 9 ఫ్లోర్లు ఉండగా.. అందులో కేవలం ఐదు లిప్ట్ లే ఉన్నాయి. వీటిలో రెండు లిఫ్టులు చెడిపోగా వాటిని రెండు నెలల నుంచీ రిపేర్​ చేస్తూనే ఉన్నారు. మిగతా మూడు లిఫ్ట్​లలో ఒక లిఫ్ట్​ మాత్రమే ఉద్యోగులకు అందుబాటులో ఉంచారు. మరో లిఫ్ట్​ సీఎస్, ఇతర ఉన్నతాధికారులకు, ఇంకో లిఫ్ట్​ను రిపేర్లుచేస్తున్న  వర్కర్స్  కోసం కేటాయించారు. రోజూ వందలాది మంది ఉద్యోగులు భవన్​లో డ్యూటీ చేస్తుంటారు. వారికి ఒకే ఒక్క లిఫ్ట్​ ఉండటం తీవ్ర సమస్యగా మారింది. మహిళ ఉద్యోగులు, దివ్యాంగ ఉద్యోగులు కూడా లిఫ్ట్​ కోసం చాలా సేపు ఎదురుచూడాల్సి వస్తోంది. కొన్ని ఫ్లోర్లలో వాష్ రూమ్ ల రిపేర్లు  కూడా ఇప్పటికీ పూర్తికాలేదు.

కారిడార్లలోనే బండిల్స్​..

బీఆర్కే భవన్​ ఫ్లోర్లలో రిపేర్లు జరుగుతుండటంతో పాత సెక్రటేరియెట్ నుంచి షిఫ్ట్​ చేసిన ఫర్నిచర్, ఫైళ్ల బండిళ్లను భవన్​లోని అన్ని కారిడార్లలో ఉంచారు. దీంతో అక్కడ నడవడానికి కూడా వీలు లేని పరిస్థితి నెలకొంది. మరోవైపు భవన్​లో సెక్రటేరియెట్​ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి మీడియాను  అటువైపు అనుమతించటం లేదు. రిపేర్లు జరగుతున్నందున ఇప్పుడు అనుమతిస్తే పనులకు ఆటంకం కలుగుతాయని అధికారులు భావిస్తున్నట్లు
తెలుస్తోంది.