- హుండీ లెక్కింపు, అటెండెంట్ జాబ్ల పేరుతో వల
- 300 మందికి పైగా బాధితులు
- నల్గొండలో వెలుగు చూసిన మోసం
- ఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరం
నల్గొండ, వెలుగు: దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. ఆలయాల్లో హుండీ లెక్కింపు, అటెండెంట్ ఉద్యోగాల పేరుతో దాదాపు 300 మందికి పైగా నిరుద్యోగులను మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వ్యవహారంపై జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆలయాల్లో హుండీ లెక్కింపు వంటి పనులకు డిమాండ్ ఉంటుందని గుర్తించిన నిందితులు దాన్ని ఎరగా వేశారు. నల్గొండ జిల్లాలోని ప్రధాన దేవాలయాల్లో హుండీ లెక్కింపు పనులు తమ ఏజెన్సీకే దక్కినట్లు ప్రచారం చేశారు. సిబ్బంది కావాలని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేశారు.
తక్కువ మొత్తమేనని భావించిన నిరుద్యోగులు అప్పులు చేసి మరీ డబ్బులు చెల్లించారు. ప్రధాన నిందితుడు రవి పలువురు ఏజెంట్లను నియమించుకుని ఈ మోసానికి పాల్పడ్డాడు. నల్గొండలో నివసిస్తున్న అన్నారం గ్రామానికి చెందిన జనార్ధన్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
యాప్లో అటెండెన్స్ వేస్తూ..
నిరుద్యోగులకు నమ్మకం కలిగించేందుకు ‘శాలరీ బాక్స్’ అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేయించి అందులో హాజరు, జీతాల వివరాలు చూపిస్తూ నిజమైన ఉద్యోగమని నమ్మించారు. యాప్ డౌన్‌లోడ్ చేసి లాగిన్ కావడానికి కూడా ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల వరకు వసూలు చేశారు.
ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు యాప్ ద్వారా హాజరు నమోదు చేయాలని నిబంధన పెట్టడంతో బాధితులు నిజంగానే ఉద్యోగం చేస్తున్నామనే నమ్మకంతో కొనసాగారు. ఇటీవల విజయవాడ కనకదుర్గ ఆలయంలో హుండీ లెక్కింపు కోసం కొంతమందిని పంపించారు.
నెలలు గడిచినా జీతాలు రాకపోవడంతో బాధితులు దేవాదాయ శాఖ అధికారులను సంప్రదించారు. ఎలాంటి ఏజెన్సీకి తాము కాంట్రాక్ట్ ఇవ్వలేదని అధికారులు చెప్పడంతో బాధితులు మోసపోయామని గ్రహించారు. ఆ తరువాత ఏజెంట్లు ఫోన్ స్విచాఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో బాధితులు?
నల్గొండ జిల్లాలోని నకిరేకల్, శాలిగౌరారం, నార్కట్పల్లి, నల్గొండ మండలాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వెయ్యికి పైగా బాధితులు ఉన్నట్లు సమాచారం. ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేయగా సుమారు రూ.30 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు.
ఇప్పటికే నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో 50 మందికి పైగా ఫిర్యాదులు చేయగా మరికొందరు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ను కలిశారు. దీంతో ఆయన దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చారు. ఈ వ్యవహారంలో దేవాదాయ శాఖ అధికారుల ప్రమేయం కూడా ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
