- డిజిటల్ సర్వేకు ఉన్నతాధికారుల నిర్ణయం
- వివరాలు ఇవ్వడంలో వెనకడుగు
- రికార్డులు లేవా ? అక్రమాలు బయటపడ్తాయనా ? అని అనుమానాలు
- రికార్డుల్లో 87 వేల ఎకరాలున్నా.. 20 వేలకుపైగా అన్యాక్రాంతం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని దేవాలయాలకు చెందిన వేలాది ఎకరాల దేవుడి మాన్యం అన్యాక్రాంతమవుతోంది.
రికార్డుల్లోని భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి పొంతన లేకుండా పోతోంది. ఆలయ భూములను రక్షించాల్సిన అధికారులే మౌనం వహిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. దేవుడి ఆస్తుల లెక్కలు తేల్చేందుకు ఉన్నతాధికారులు డిజిటల్ సర్వేకు శ్రీకారం చుట్టారు. కానీ, ఆ వివరాలు ఇచ్చేందుకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఏసీలు, డీసీలు వెనుకడుగు వేస్తున్నారు. అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే రికార్డులు దాస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రికార్డుల్లో 87,261 ఎకరాలు..
దేవాదాయశాఖ రికార్డుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆలయాలకు సుమారు 87,261 ఎకరాల భూములుండగా.. 20,124.03 ఎకరాలు ఆక్రమణలకు గురికాగా.. విత్ అవుట్ లిటిగేషన్‌తో మరో 5,569.35 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో సుమారు ఆరు వేల ఎకరాలకు పైగా భూములు ఉన్నట్లు ఎండోమెంట్ ఆఫీసర్లు గుర్తించారు.
అయితే, భూముల సరిహద్దులు గుర్తించేందుకు, జియో ట్యాగింగ్ చేసేందుకు ప్రభుత్వం డిజిటల్ సర్వేను ప్రతిపాదించింది. అయితే ఈ సర్వేకు కావాల్సిన పాత రికార్డులు, రిజిస్టర్లను అందించడంలో ఆఫీసర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారు.
ఒక రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆఫీసర్లు మినహా మిగతా జిల్లాల ఏసీలు, ఈవోలు ఇంకా ఆలయ భూముల సంబంధించిన వివరాలు అందజేయలేదు. కొన్ని జిల్లాల ఆఫీసర్లు.. ఆలయానికి సంబంధించిన రికార్డులే లేవని చెబుతుండడం గమనార్హం. గతంలో జరిగిన భూ దందాలు, అక్రమ లీజుల వ్యవహారాలు ఎక్కడ బయటపడతాయోనని క్షేత్రస్థాయి అధికారులు వెనుకంజ వేస్తున్నారని సమాచారం.
తొలి విడత 40 వేల ఎకరాల్లో సర్వే
తొలి విడతలో 40 వేల ఎకరాల్లో డిజిటల్ సర్వే చేపట్టనున్నారు. ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్- జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా సర్వే చేపట్టనున్నారు. ఈ జిల్లాల్లో ఎక్కువగా ఆలయ భూములు ఆక్రమణకు గురయ్యాయి.
హైదరాబాద్ నగరం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు పెరగడంతో ఆలయ భూములపై కొందరు వ్యక్తుల కన్ను పడింది. హైదరాబాద్ పాతబస్తీ, సికింద్రాబాద్, అంబర్‌పేట వంటి ప్రాంతాల్లో సుమారు 1,200 నుంచి 1,500 ఎకరాల ఆలయ భూములు ఉన్నాయి.
ఇందులో 60 శాతానికిపైగా భూమి కబ్జాలు, కోర్టు కేసుల్లోనే ఉంది. ఇక రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కోట్ల విలువైన భూములున్నాయి. ఆయా జిల్లాల్లో ఆలయ భూములు వేల ఎకరాలుండగా.. ప్లాట్లుగా మార్చేసి అమ్ముకున్న సంఘటనలున్నాయి.
నిబంధనలు తుంగలో తొక్కి భూములు లీజు
దేవాదాయశాఖ నిబంధనలను తుంగలో తొక్కి ఆలయ భూములను అక్రమంగా లీజులకు ఇస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో ఆలయ భూములను వ్యవసాయం కోసమో, చిన్నపాటి అవసరాల కోసమో తక్కువ ధరకు లీజుకు తీసుకున్నవారు.. ఇప్పుడు ఆ భూములను దేవాదాయ శాఖకు తెలియకుండా థర్డ్ పార్టీలకు సబ్-లీజుకు ఇస్తున్నారు.
హైదరాబాద్‌లోని ఓ ఆలయానికి సంబంధించిన భూమిని ఈవో ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. ప్రతినెలా రూ.50 వేలకుపైగా కిరాయి వసూలు చేస్తున్నారని దేవాదాయశాఖకు ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులు ఎంక్వైరీకి ఆదేశించారు. ఆఫీసర్లు విచారణకు వస్తున్న విషయం లీక్ కావడంతో... ఆ స్థలాన్ని ఈవో ఆఫీస్‌గా మార్చేశారు.
ఖాళీ స్థలాన్ని ఈవో ఆఫీస్‌గా వాడుకుంటున్నామని, ఎవరికీ లీజ్‌కు ఇవ్వలేదని ఈవో చెప్పడంతో చేసేదేమీ లేక ఆఫీసర్లు వెనుదిరిగారు. హైదరాబాద్ శివార్లలోని ఓ ఆలయానికి చెందిన ఐదు ఎకరాల భూమిని ఓ వ్యక్తి ఏడాదికి రూ.20 వేలకే లీజుకు తీసుకున్నాడు. తర్వాత అందులో కమర్షియల్ గోదాములు కట్టించి నెలకు రూ. 2 లక్షల అద్దె వసూలు చేస్తున్నాడు.
ఈ సొమ్ము ఆలయ ఖాతాలోకి వెళ్లకుండా ఆ వ్యక్తి జేబులోకి వెళ్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి లీజును రెన్యూవల్ చేయాల్సి ఉన్నా ఆఫీసర్లు అవేమీ పట్టించుకోకపోవడంతో పలు జిల్లాల్లో 30 నుంచి -40 ఏండ్ల కింద కుదుర్చుకున్న లీజు అగ్రిమెంట్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వీటిని రద్దు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా రాజకీయ ఒత్తిళ్లతో క్షేత్రస్థాయి ఆఫీసర్లు మిన్నకుండిపోతున్నారు. నగరాల సమీపంలోని ఆలయ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే షెడ్లు, దుకాణాలు వెలుస్తున్నాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయం ఆలయానికి రాకుండా, సిండికేట్ ఏర్పాటు చేసుకుని పంచుకుంటున్నారు. ధర్మకర్తల మండలిలోని కొందరు వ్యక్తులు తమ అనుచరుల పేర్లతో ఈ భూములను తక్కువ ధరకు లీజుకు తీసుకొని ఈ దందాలు నడిపిస్తున్నారని సమాచారం.
అక్రమాలు బయటపడతాయనేనా ?
ప్రతి ఆలయానికి ఓ రిజిస్టర్ ఉంటుంది. అందులో భూమి వివరాలు ఉండాలి. కానీ, చాలా మంది ఈవోలు ఈ రిజిస్టర్లను అప్‌డేట్ చేయడం లేదు. డిజిటల్ సర్వే చేస్తే ఏ భూమి ఎవరి ఆధీనంలో ఉందో, ఎవరు అక్రమంగా లీజుకు ఇచ్చారో తెలిసిపోతుందని భయపడుతున్నారు. అందుకే ఉన్నతాధికారులు వివరాలు అడిగినా.. ఫైళ్లు దొరకడం లేదు.. కోర్టులో కేసులు ఉన్నాయంటూ కాలయాపన చేస్తున్నారు. కానీ ఏండ్లుగా అధికారుల అండదండలతోనే ఈ భూదందాలు సాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. సరిహద్దులు గుర్తిస్తే ఎక్కడ తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందోనని కొందరు అధికారులు కావాలనే రికార్డులు అందజేయడంలో జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.
