
లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఇండియా విమెన్స్ టీమ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. స్మృతి మంధాన (51 బాల్స్‌లో 5 ఫోర్లతో 42), దీప్తి శర్మ (34 బాల్స్‌లో 2 ఫోర్లతో 30 నాటౌట్) మినహా మిగతా వారు ఫెయిలవడంతో.. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్) ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లిష్ టీమ్ 1–1తో సమం చేసింది. వర్షం కారణంగా ఆలస్యమైన ఈ మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడిన ఇండియా 143/8 స్కోరు చేసింది. ఎకిల్‌స్టోన్ (3/27) మూడు వికెట్లతో దెబ్బకొట్టింది.
తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించడంతో టార్గెట్‌ను 24 ఓవర్లలో 115గా మార్చారు. దీన్ని ఇంగ్లిష్ జట్టు 21 ఓవర్లలో 116/2 స్కోరు చేసి ఛేదించింది. ఓపెనర్లు అమీ జోన్స్ (57 బాల్స్‌లో 5 ఫోర్లతో 46 నాటౌట్), ట్యామీ బ్యూమోంట్ (35 బాల్స్‌లో 5 ఫోర్లతో 34) తొలి వికెట్‌కు 54 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చారు. 11వ ఓవర్‌లో బ్యూమోంట్ ఔటైనా తర్వాత వచ్చిన కెప్టెన్ సివర్ బ్రంట్ (21) నిలకడగా ఆడింది.
102/1 స్కోరు వద్ద మళ్లీ వర్షం రావడంతో ఆగిపోవడంతో టార్గెట్‌ను రివైజ్ చేశారు. ఆట మొదలైన తొలి బాల్‌కే బ్రంట్ ఔట్‌కావడంతో రెండో వికెట్‌కు 48 రన్స్ జతయ్యాయి. చివర్లో సోఫియా డంక్లీ (9 నాటౌట్), జోన్స్‌తో కలిసి ఈజీగా విజయాన్ని అందించింది. ఎకిల్‌స్టోన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన మూడో వన్డే మంగళవారం చెస్టర్ లీ స్ట్రీట్‌లో జరుగుతుంది.
బ్యాటర్లు ఫెయిల్..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియాను కట్టడి చేయడంలో ఇంగ్లిష్ బౌలర్లు సక్సెస్ అయ్యారు. రెండో ఓవర్‌లోనే ప్రతీకా రావల్ (3)ను ఔట్ చేసి అర్లాట్ (2/26) ఇచ్చిన వికెట్ల పతనం చివరి వరకు కంటిన్యూ అయ్యింది. మంధాన, హర్లీన్ డియోల్ (16) నెమ్మదిగా ఆడటంతో 6 ఓవర్ల పవర్‌ప్లేలో ఇండియా 25/1 స్కోరు మాత్రమే చేసింది. అయితే ఇన్నింగ్స్ కుదుటపడే టైమ్‌లో ఎకిల్‌స్టోన్ వరుస ఓవర్లలో హర్లీన్, హర్మన్‌ప్రీత్ కౌర్ (7)ను పెవిలియన్‌కు పంపింది. దీంతో రెండో వికెట్‌కు 40 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది.
జెమీమా (3), రిచా ఘోష్ (2) కూడా నిరాశపరచడంతో 26 రన్స్ తేడాలో నాలుగు కీలక వికెట్లు పడటంతో ఇండియా స్కోరు 72/5గా మారింది. ఈ టైమ్‌లో వచ్చిన దీప్తి శర్మ కీలక భాగస్వామ్యాలతో చివరి వరకు నిలిచింది. ఇంగ్లిష్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్న మంధానను 21వ ఓవర్‌లో లిన్సే స్మిత్ (2/28) ఔట్ చేయడంతో ఆరో వికెట్‌కు 26 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వేగంగా ఆడే క్రమంలో అరుంధతి రెడ్డి (14) వెనుదిరిగింది. చివర్లో స్నేహ్ రాణా (6), క్రాంతి గౌడ్ (4 నాటౌట్) తక్కువ స్కోరుకే పరిమితం కావడంతో ఇండియా పెద్ద టార్గెట్‌ను నిర్దేశించలేదు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 29 ఓవర్లలో 143/8 (స్మృతి మంధాన 42, దీప్తి శర్మ 30*, ఎకిల్‌స్టోన్ 3/27). ఇంగ్లండ్: (24 ఓవర్లలో 115) : 21 ఓవర్లలో 116/2 (అమీ జోన్స్ 46*, బ్యూమోంట్ 34, స్నేహ్ రాణా 1/12).