భూముల అన్యాక్రాంతంపై విచారణ జరిపించండి

భూముల అన్యాక్రాంతంపై విచారణ జరిపించండి
  • సీఎం, హైకోర్టు సీజేకు రిటైర్డ్  రెవెన్యూ అధికారుల యూనియన్  లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో గత పదేళ్లలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని రిటైర్డ్  రెవెన్యూ అధికారుల సెంట్రల్  యూనియన్  ప్రెసిడెంట్  లక్ష్మయ్య ఆరోపించారు. ధరణిని అడ్డుపెట్టకొని కొంతమంది ఉన్నతాధికారులు కొంత మంది పెద్దలకు ఆ భూములను కట్టబెట్టారన్నారు. 

ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని ఈడీ, సెంట్రల్  విజిలెన్స్  కమిషన్, సీఎం రేవంత్ రెడ్డి, హైకోర్టు చీఫ్  జస్టిస్  అలోక్ అరాధేకు ఆయన లేఖలు రాశారు. ఆదివారం అబిడ్స్ లో రిటైర్డ్  రెవెన్యూ అధికారులు సమావేశం అయ్యారు. లక్ష్మయ్య  మాట్లాడుతూ గుట్టల బేగంపేటలో 42 ఎకరాలు, గోపననల్లిలో 650 ఎకరాలు, హఫీజ్ పేటలో 20 ఎకరాలు, మోకిలలో 150 ఎకరాలు, ఎల్లమ్మబండలో 92 ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని ఆరోపించారు. 

ధరణిని అడ్డుపెట్టుకుని వివాదాల్లో ఉన్న భూములను నిషేధిత జాబితాలో చేర్చి, తరువాత ప్రభుత్వ పెద్దల పేరిట పట్టాలు చేపించారని ఆయన పేర్కొన్నారు. ఇందుకు కలెక్టర్లు సైతం సహకరించారన్నారు. వీటిపై సమగ్ర విచారణ జరిపించి నిందితులను శిక్షించి ప్రభుత్వ భూముల ను స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్  చేశారు. ఈ సమావేశంలో రిటైర్డ్  డిప్యూటీ కలెక్టర్లు, రిటైర్డ్  తహసీల్దార్లు పాల్గొన్నారు.