అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఈపీఎస్ వేటు!

అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఈపీఎస్ వేటు!

బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన సొంత పార్టీ నేతలపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కఠిన చర్యలు తీసుకున్నారు. పార్టీ విప్‌‌ను ధిక్కరించి, సీఎం విజయ్‌‌కు అనుకూలంగా ఓటు వేసినందుకు గాను మాజీ మంత్రులు సీవీ షణ్ముగం, ఎస్.పి. వేలుమణి సహా పలువురు కీలక నేతలను పార్టీ పదవుల నుంచి ఈపీఎస్ తొలగించారు. బల పరీక్ష సందర్భంగా అసెంబ్లీలో ఎడప్పాడి మాట్లాడుతూ.. తమ ఎమ్మెల్యేలను టీవీకే పార్టీ ప్రలోభాలకు గురిచేసిందని తీవ్రంగా ఆరోపించారు. 

మంత్రి పదవులు, ఇతర నామినేటెడ్ పదవుల ఆశ చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని విజయ్ అపహాస్యం చేస్తున్నారని ఎడప్పాడి ధ్వజమెత్తారు. కాగా, పార్టీ విప్‌‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన మొత్తం 25 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశామని అన్నాడీఎంకే పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.