
హైదరాబాద్, వెలుగు : పురుషుల్లో మహిళలపై ఉన్న వివక్షను తొలగించినప్పుడే సమానత్వం సాధ్యమవుతుందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ అన్నారు. నాగరికత సాధించినప్పటికీ సమాజంలో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ వివక్ష ఉందో గుర్తించి నిర్మూలించాలని కోరారు. జెండర్ సెన్సిటైజేషన్ అండ్ ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ నిర్వహించిన వ్యాసరచన పోటీ విజేతలకు జస్టిస్ సుజయ్‌పాల్..హైకోర్టు బార్ అసోసియేషన్‌లో బహుమతులు ప్రదానం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక స్థాయిలో మహిళల గొప్పదనాన్ని గుర్తించేలా చేస్తే సమానత్వం సాధ్యమన్నారు. దేశంలో సగానికిపైగా ఉన్న మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు. ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ చైర్మన్ జస్టిస్ టి. మాధవీదేవి మాట్లాడుతూ.. కమిటీకి రెండు ఫిర్యాదులు మాత్రమే వచ్చాయని.. ఆధారాల లేకపోవడంతో వాటిని కొట్టివేసినట్లు తెలిపారు.
కమిటీ సభ్యురాలు జస్టిస్ జువ్వాడి శ్రీదేవి మాట్లాడుతూ.. మహిళలపై లైంగిక వేధింపులు రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్, జస్టిస్ జె. శ్రీనివాసరావు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ. నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, న్యాయవాది విజయలక్ష్మి పాల్గొన్నారు.