20 సీట్లు మార్చాలని చెప్పినా కేసీఆర్‍ వినలేదు

20 సీట్లు మార్చాలని చెప్పినా కేసీఆర్‍ వినలేదు

వరంగల్‍, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సమయంలో 20 మంది సిట్టింగ్‍ ఎమ్మెల్యేలను మార్చాలని కేసీఆర్‍కు చెప్పానని.. తాను చెప్పినట్లు మార్చుంటే రాష్ట్రంలో ఫలితాలు వేరేలా ఉండేవని బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌ రావు అన్నారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ ఆఫీస్‍లో ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను కూడా ఓడిపోతున్నాననే విషయం తనకు ముందే తెలిసిందన్నారు. తక్కువ మెజార్టీతో గెలుస్తానని ముందు అనుకున్నానని, అయితే, కాంగ్రెస్‍ మహిళా అభ్యర్థి కన్నీరు కార్చడంతో ఫలితం మారిందని చెప్పారు.

 ఈ విషయాన్ని తాను ఆలస్యంగా గుర్తించానని చెప్పారు. రేవంత్‌‌ రెడ్డి అంటేనే మాటలతో బురిడిగొట్టే మోసగాడని మండిపడ్డారు. లోక్‍సభ ఎన్నికలయ్యాక మొదట బీజేపీలో చేరేది ఆయనేనన్నారు. డిసెంబర్‍ 9 వరకు హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి, ఆ గడువును ఆగస్టు 15 వరకు పెంచిండన్నారు. అప్పటివరకు రాష్ట్రంలో అన్ని రకాల ఎలక్షన్లు పూర్తవుతాయి కాబట్టి, హామీలను పక్కనబెడతారని చెప్పారు. కడియం శ్రీహరి అంటేనే కనిపించని మోసకారి అని తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యమ సమయంలో రాష్ట్రంలో టీడీపీ పూర్తి ప్రభావం కోల్పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారానని.. కడియం మాత్రం పదవుల కోసం ఎన్టీఆర్‌‌‌‌, చంద్రబాబు, కేసీఆర్‍తో పాటు జిల్లాలో తనను సైతం మోసం చేశాడని ఆరోపించారు.