సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం
హైదరాబాద్ సనత్ నగర్ లోని ESI హాస్పిటల్ లో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజ్ భవనాన్ని ప్రారంభించారు కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఈఎస్ఐకి వచ్చిన గంగ్వార్.. మెడికల్ కాలేజీ భవనంతో పాటు.. దానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించారు. ఔట్ పేషంట్ బిల్డింగ్ కు శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రులు.
33 ఎకరాల విస్తీర్ణంలో 620 బెడ్లతో హాస్పిటల్ ను నిర్మించారు. ఇందులో 150 బెడ్లను సూపర్ స్పెషాలిటీ విభాగాలకు కేటాయించారు. మెడికల్ కాలేజీ కోసం రూ.600కోట్లు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు రూ.400 కోట్లు, ఔట్ పేషెంట్ బిల్డింగ్ కోసం రూ.150కోట్లు కేటాయింపులు జరిగాయి.
ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో కార్మికుల పిల్లలకు 50శాతం సీట్లు కేటాయించాలని ప్రధాని మోడీ నిర్ణయించారని కిషన్ రెడ్డి చెప్పారు. ఆ నిర్ణయంతో.. కాలేజీలో 200 మందికి ఎంబీబీఎస్ సీట్లు దక్కాయన్నారు. హైదరాబాద్ తో పాటు.. మిగతా ప్రాంతాల్లోనూ ఈఎస్ఐ క్లినిక్స్ ఏర్పాటు ఆలోచన ఉందన్నారు.
హైదరాబాద్ లో ఇది ఇప్పుడు అత్యుత్తమ హాస్పిటల్ అయిందన్నారు. దేశంలో ఈ హాస్పిటల్ ని నంబర్ వన్ చేయాలి అనుకుంటున్నామని.. అందుకు కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందన్నారు. 50 కోట్ల మంది నిరుపేద ప్రజలకు ఆయుష్మాన్ భారత్ ఉపయోగపడుతోంది కానీ.. తెలంగాణ ప్రభుత్వం దానిని పక్కన పెట్టిందని కిషన్ రెడ్డి అన్నారు. ఎయిమ్స్ హాస్పిటల్ అనేది నరేంద్ర మోడీ తెలంగాణకి ఇచ్చిన గిఫ్ట్ అనీ.. రూ.1200 కోట్లు ఇందుకోసం కేటాయించారని చెప్పారు.
కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్ ఏరియాలో ఇంకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని విజ్ఞప్తిచేశారాయన. రాష్ట్ర ప్రభుత్వం అన్ని హాస్పిటళ్లలోనూ మెరుగైన వసతులు కల్పిస్తోందన్నారు మల్లారెడ్డి.
