మహిళాలోకానికి ఈశ్వరీబాయి ఆదర్శం..రవీంద్రభారతిలో ఘనంగా 107వ జయంతి ఉత్సవాలు

మహిళాలోకానికి ఈశ్వరీబాయి ఆదర్శం..రవీంద్రభారతిలో ఘనంగా 107వ జయంతి ఉత్సవాలు
  •     అంబేద్కర్​ ఆశయసాధన కోసం పోరాడిన నాయకురాలు: అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్
  •     అట్టడుగు వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేశారు: మంత్రి వివేక్​ వెంకటస్వామి
  •     ఈశ్వరీబాయి అవార్డును అందుకున్న మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు:  చిన్నతనంలోనే భర్తను కోల్పోయినా.. జీవితంలో ఉన్నతంగా ఎదిగిన ఈశ్వరీబాయి మహిళా లోకానికి ఆదర్శమని అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్​అన్నారు. సోమవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ, ఈశ్వరీబాయి​ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కురాలు, మాజీ ఎమ్మెల్యే ఈశ్వరీబాయి 107వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి మంత్రులు వివేక్​ వెంకటస్వామి, సీతక్క, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్, టీజీఐఐసీ చైర్​పర్సన్​ నిర్మలా జగ్గారెడ్డి, సంగీత నాట్య అకాడమీ అధ్యక్షురాలు అలేఖ్య పుంజాల, కార్పొరేటర్ విజయా రెడ్డి హాజరయ్యారు. ఈశ్వరీబాయి​మెమోరియల్ ట్రస్ట్ చైర్​పర్సన్​మాజీ మంత్రి గీతారెడ్డి ఆధ్వర్యంలో ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 

ఈ సందర్భంగా  స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​ చేతులమీదుగా మంత్రి సీతక్క ‘ఈశ్వరీబాయి స్మారక అవార్డు’ అందుకున్నారు. మహిళలు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ రంగాల్లో విశిష్ట సేవలకు గుర్తింపుగా సీత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్కకు ఈ  అవార్డు దక్కింది.  ఈ సందర్భంగా స్పీకర్​ ప్రసాద్​కుమార్​ మాట్లాడుతూ.. మహిళా సాధికారత, సామాజిక న్యాయం, అట్టడుగు వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్గాల అభివృద్ధిలో సీతక్క కృషికి గౌరవం దక్కిందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం పోరాడిన నాయకురాలు ఈశ్వరీబాయి అని పేర్కొన్నారు. 

సమాజంలో దళితుల హక్కులు, వారి అభ్యున్నతి కోసం పోరాడిన గొప్ప నాయకురాలు అని కొనియాడారు. మహిళా విద్యార్థులకు ఉచిత విద్యనందించిన ఘనత ఈశ్వరీబాయి సొంతమన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకు సామాజిక న్యాయం ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్నారన్నారు. 

దేశంలో ఆదివాసీల పట్ల అణచివేత పెరగడం ఆందోళనకరం: మంత్రి సీతక్క

ఈశ్వరీబాయి అవార్డుతో తనకు మరింత బాధ్యతను అప్పగించినట్టేనని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆమె​చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, వాటిని కొనసాగించడమే నిజమైన నివాళి అని అన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని నీరుగార్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని,  అంబేద్కర్ ను అవమానించే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ లేకుంటే తామంతా అడవుల్లోనే ఉండిపోయేవాళ్లమని, తనను జీవితం ఎన్నిసార్లు మలుపులు తిరిగినా, రాజ్యాంగంపై విశ్వాసమే నన్ను నేడు మంత్రి స్థాయికి చేర్చిందన్నారు. 

మాజీ మంత్రి గీతా రెడ్డి.. ఈశ్వరీబాయి జీవితాన్ని స్మరించుకుంటూ ఆమె చేసిన సేవలు నేటికీ సమాజానికి ప్రేరణనిస్తాయని పేర్కొన్నారు. ఆమె చూపిన మార్గంలోనే ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అంబేద్కర్ సంఘాల నేత జేబీ రాజు మాట్లాడుతూ.. ట్యాంక్ బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఈశ్వరీబాయిదేనని గుర్తుచేశారు. 

మహిళల అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేశారు: మంత్రి వివేక్​

దళితుల హక్కుల కోసం  ఈశ్వరీబాయి  కొట్లాడారని, ఒక టీచర్ నుంచి మున్సిపల్ కార్పొరేటర్ గా రెండు సార్లు గెలిచి, ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచి ప్రజలకు ఎన్నో సేవలందించారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. 1969లో తెలంగాణ  కోసం ఈశ్వరీబాయి పోరాడారని, అప్పట్లో ఆమె టీపీఎస్ లో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారన్నారు. అంబేద్కర్ ఆలోచనలు, ఆయన స్ఫూర్తిని అందించారన్నారు. ఈశ్వరీబాయ్​ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అప్పట్లో అణచివేతకు గురయ్యే వారికి ఈశ్వరీబాయి నేనున్నానని ధైర్యం చెప్పేవారన్నారు. 

స్కూల్ టీచర్ గా ఉన్నప్పుడు విద్య అందివ్వాలని మహిళలు రాణించాలంటే విద్యలో ముందుండాలని ఈశ్వరీబాయి  స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థాపించి విద్యను అందించారన్నారు. అలాగే  మహిళలకు ఉచిత విద్య అందించాలని పోరాటాలు కూడా  చేశారన్నారు. ఈశ్వరీబాయి స్థాపించిన స్కూల్స్ ని ఆమె స్పూర్తితోనే  గీతారెడ్డి కూడా నర్సింగ్ హోం స్థాపించి పేదలకు సేవలందిస్తున్నారన్నారు. ఇండ్రస్ట్రీ, టూరిజం మంత్రిగా గీతారెడ్డి కూడా చాలా పనులు చేశారన్నారు. 

గోల్కొండ లో గోల్ఫ్ కోర్ట్ స్థాపించిన సమయంలో గీతారెడ్డి అనుమతులు ఇచ్చారని, వంద ఎకరాల్లో ఏర్పాటు చేసిన గోల్ఫ్ కోర్ట్  ఎంతో మందికి ఉపయోగపడుతున్నదన్నారు. గీతారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆమెపై ఒక్క అలిగేషన్ కూడా రాలేదని, ఆమె  ఎవరికి భయపడకుండా ముందుకెళ్లారన్నారు. ఆరోగ్యం బాగున్న లేకపోయిన కూడా గీతారెడ్డికి  ఏటా డాక్టర్ ఈశ్వరీబాయి  జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు.

 ఈశ్వరీబాయి ట్రస్ట్ ద్వారా చాలా సేవలు అందిస్తున్నారని,  ఈ సందర్భంగా గీతారెడ్డితో పాటు డాక్టర్ రాంచంద్రారెడ్డిని అభినందిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డు అందుకుంటున్న  మంత్రి సీతక్కకి అభినందనలు తెలిపారు. ఈశ్వరీబాయి గురించి  మా నాన్న కాకా కూడా ఎప్పుడు చెబుతుండేవారని, వాళ్లిద్దరు మంచి స్నేహితులు అన్నారు.