
- హుజూరాబాద్ ఎలక్షన్ కోసమే దళిత బంధు తెచ్చామన్న సీఎంపై ఈటల ఫైర్
- కేసీఆర్ పాలనలోనే నిర్బంధాలు ఎక్కువైనయ్
- ఉద్యమం సమయంలోనూ ఇంతలా లేవని కామెంట్
కమలాపూర్/ఇల్లందకుంట,వెలుగు:ఎన్నికల్లో గెలిచేందుకే దళిత కుటుంబాలకు రూ.10లక్షల స్కీమ్ తెచ్చామని సీఎం కేసీఆర్ అనడం ఆయన బరితెగింపునకు నిదర్శనమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. పాదయాత్రలో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం బోగంపాడు గ్రామంలో ఆయన మాట్లాడారు. ‘మూడేండ్లుగా ఇయ్యని11వేల పింఛన్లు హుజూరాబాద్‌లో ఇప్పుడిస్తున్నరు.. కుల సంఘాల భవనాలు ఇస్తున్నరు.. దళితులకు 10 లక్షలు ఇస్తమంటున్నరు.. అందరికీ ఇయ్యండి.. నిరుద్యోగులుగా ఉన్న యువకులకు రూ.3,016 పెన్షన్ కూడా ఇయ్యండి..’ అని ప్రభుత్వానికి రాజేందర్ సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాగే వరదల పేరుతో రూ.900 కోట్లు పంచితే ప్రజలు టీఆర్ఎస్కు కర్రు కాల్చి వాత పెట్టారని, రేపు హుజూరాబాద్‌లోనూ ఇదే జరగబోతుందని ఈటల రాజేందర్ చెప్పారు.
రాష్ట్రంలో స్వేచ్ఛ లేదు..
ప్రజాదీవెన యాత్ర మూడో రోజులో భాగంగా ఈటల బుధవారం కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలంలోని వంగపల్లి, మర్రిపల్లిగూడెం, మర్రిపల్లి, ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామాల్లో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యమ సమయంలో ఉప్పల్ రైల్‌రోకోలో 72 గంటల పాటు పట్టాలపై పడుకుని ఆ సెగను ఢిల్లీకి తాకేలా చేశామని, కానీ, అప్పుడు లేని నిర్బంధాలు తెలంగాణ వచ్చాక కేసీఆర్ పాలనలోనే ఎక్కువయ్యాయని ఈటల అన్నారు. స్వేచ్ఛ, గౌరవం లేకుండాపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అహంకారాన్ని గెలిపిస్తారా? లేదంటే పేద ప్రజల గొంతైన ఈటలను గెలిపస్తారా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. టీఆర్ఎస్ వాళ్లు ఏమిచ్చినా, ఎన్నిచ్చినా తీసుకోవాలని, ఓటు మాత్రం బీజేపీకే వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దళితులను సీఎం కేసీఆర్ అన్ని విధాలా మోసం చేశాడని, దళితులకు ముఖ్యమంత్రి, మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేశాడని, ఉప ముఖ్యమంత్రి పదవిచ్చి లాక్కున్నాడని మండిపడ్డారు. సీఎంవోలో అసలు దళితులే లేరన్నారు. రాష్ట్రంలోని దళితులందరికీ దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నేనెక్కడా తప్పు చెయ్యలె
తన రాజకీయ జీవితంలో ఎక్కడా తప్పు చేయలేదని అన్నారు. 5 వేల మంది నిరుపేద స్టూడెంట్లు చదువుకోవడం కోసం కమలాపూర్‌లో విద్యాసంస్థలను నిర్మించామన్నారు. గ్రామాల్లో టీఆర్ఎస్ నేతలు గొడవలు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, బీజేపీ క్యాడర్ అంతా కాముగా ఉండాలని సూచించారు. వాళ్లే జెండాలు తగులబెట్టుకుని, వాహనాలపై రాళ్లు వేసుకుని బీజేపీపై నెట్టే ప్రయత్నాలు చేస్తారని అన్నారు. నాలుగు కొడితే పడండిగానీ.. వాళ్ల జోలికి మాత్రం పోవద్దన్నారు. ధర్మం, న్యాయం శ్రీరామరక్ష అనుకుంటూ ప్రజల ప్రేమను పొందాలన్నారు. వాళ్లకు మాటలు, తిట్లతో కాకుండా ఓట్లతో గుణపాఠం చెప్పాలని ఈటల పిలుపునిచ్చారు. పాతర్లపల్లి గ్రామస్థులకు ఒక కాల్వ బ్రిడ్జి కట్టించాల్సి ఉందని, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాల్సి ఉందని ఈటల అన్నారు. ఇక్కడ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టడం సాధ్యం కాదని, ఎవరి స్థలాల్లో వారే ఇండ్లు కట్టుకునేలా లబ్ధిదారులకు డబ్బులివ్వాల్సిందిగా ప్రభుత్వానికి ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. తాను రాజీనామా చేసిన తర్వాతే హుజూరాబాద్‌లో 11 వేల మందికి కొత్త పింఛన్లు వచ్చాయని, రాష్ట్రం మొత్తానికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేల మందిని తరలించి ఉద్యమం చేసిన ఈటలపై కుట్రలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ మండిపడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా దళితులకు రూ.10 లక్షలు ఇవ్వాలని, లేదంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీపీల ఇండ్ల ముందు చావు డప్పు కొడతారని ఆమె హెచ్చరించారు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో తన సీఎం సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని ఈటలను కేసీఆర్ బయటకు పంపించాడని మండిపడ్డారు.