సర్కార్ వెనుకడుగు వేసినా..వీడని టెన్షన్

సర్కార్ వెనుకడుగు వేసినా..వీడని టెన్షన్

ఓరుగల్లులో ల్యాండ్ పూలింగ్ పై సర్కార్ వెనకడుగు వేసినా..రైతుల్లో టెన్షన్ తగ్గడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రకటనకు పొంతన లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.ల్యాండ్ పూలింగ్ పై స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు పోరాటం చేస్తామంటున్నారు రైతులు. 
వరంగల్ రైతులను ల్యాండ్ పూలింగ్ భయం వెంటాడుతూనే ఉంది. 27 గ్రామాలను కవర్ చేసే ఔటర్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్ ప్రతిపాదిత ల్యాండ్ పూలింగ్ సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదంటున్నారు అన్నదాతలు. 10 రోజుల పాటు రైతుల వరుస ఆందోళనలతో స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు అత్యవసరంగా సమావేశమై ఇష్యూపై చర్చించారు. ల్యాండ్ పూలింగ్ కు తాము వ్యతిరేకమని ఎమ్మెల్యేలు చెప్పడంతో  దీన్ని రద్దుచేస్తున్నట్లు కుడా చైర్మన్ సుందర్ రాజ్ తెలిపారు. ఆ తర్వాత కూడా వైస్ చైర్మన్ తో పాటు అధికారి ప్రావిణ్య ఆఫిషియల్ గా ఓ నోట్ విడుదల చేశారు. ఇందులో ల్యాండ్ పూలింగ్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నని చెప్పడంపై రైతులు అనుమానాలు   వ్యక్తంచేస్తున్నారు.  
కుడా చైర్మన్  ప్రకటనకు ,కుడా వైస్ చైర్మన్ ,అధికారి రిలీజ్ చేసిన ప్రెస్ నోటుకు చాలా తేడా ఉందంటున్నారు రైతులు.కొన్నిరోజుల తర్వాత మళ్లీ ల్యాండ్ పూలింగ్ మొదలు పెట్టే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. జీవో రద్దు చేస్తూ  స్పష్టమైన ప్రకటన  వచ్చే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామంటున్నారు.స్థానిక ఎమ్మెల్యేలు జీవోరద్దు కోసం ప్రయత్నం చేయకుంటే నిరసన తప్పదని హెచ్చరిస్తున్నారు. రైతుల్లో భయాన్ని తొలగించేందుకు జీవో రద్దుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలంటున్నాయి విపక్షాలు.