సాయంత్రం ఓపీ డాక్టర్లకు రొటేషన్ డ్యూటీలు

సాయంత్రం ఓపీ డాక్టర్లకు రొటేషన్ డ్యూటీలు
  • వైద్యాధికారులకు డీఎంఈ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో సాయంత్రం ఓపీ ప్రారంభించడానికి అనుగుణంగా డాక్టర్లు, స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రొటేషనల్ పద్ధతిలో డ్యూటీలు వేయాలని దవాఖాన్ల సూపరింటెండెంట్లను డీఎంఈ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదేశించారు. సాయంత్రం పూట ఓపీలో పనిచేసే డాక్టర్లకు ఉదయం 9 గంటలకు బదులు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 7 గంటల వరకు డ్యూటీ కేటాయించాలని సూచించారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గైనకాలజీ విభాగాల్లో సోమవారం నుంచే ఈవినింగ్ ఓపీ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

ఈ మేరకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిద్దిపేట జిల్లాల్లోని టీచింగ్ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లతో డీఎంఈ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రొఫెసర్లు సహా ప్రతి ఒక్కరితో తప్పనిసరిగా బయోమెట్రిక్ అటెండెన్స్ వేయించాలని, వాటినే పరిగణనలోకి తీసుకుంటామని డీఎంఈ స్పష్టం చేశారు.

సాయంత్రం క్లినిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చే పేషెంట్ల కోసం అవసరమైతే ప్రొఫెసర్లను కూడా పిలిపించాలని సూపరింటెండెంట్లకు సూచించారు. డ్యూటీ టైమింగ్స్ 4 గంటల వరకేనని, ఆ తర్వాత ఎలా పనిచేస్తామని కొంత మంది డాక్టర్లు ప్రశ్నిస్తుండడంపై డీఎంఈ స్పందించారు. ఈవినింగ్ వచ్చే వారికి మార్నింగ్ మినహాయింపు ఇస్తున్నామని, టైమింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయంలో అనవసరమైన ఆందోళన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు.