ఈచ్ వన్ టీచ్ వన్.. 2020లో ఇదే మన నినాదం

ఈచ్ వన్ టీచ్ వన్.. 2020లో ఇదే మన నినాదం

తెలంగాణ ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు సీఎం కేసీఆర్. రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలోనే తెలంగాణ చాలా విషయాల్లో నెంబర్ వన్ గా నిలవడం గర్వకారణమన్నారు. విజయాలను స్పూర్తిగా తీసుకుని 2020 సంవత్సరంలో ముందుకెళ్లాలన్నారు. తెలంగాణను 100 శాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రజలు న్యూ ఇయర్ సందర్భంగా ప్రతిన తీసుకోవాలన్నారు. ఈచ్ వన్  – టీచ్ వన్ అనే నినాదంతో ప్రతీ ఒక్క చదువుకున్న విద్యావంతుడు నిరక్షరాస్యుడైన మరొకరిని అక్షరాస్యులుగా మార్చాలని  కోరారు. రాష్ట్రాన్ని వందశాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మార్చేందుకు అందరూ కృషి చేయాలన్నారు. తెలంగాణలో సంపూర్ణ అక్షరాస్యత సాధించే కార్యాచరణను ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుందన్నారు

అంధకారమైన రాష్ట్రాన్ని ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దడం తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప విజయాల్లో ప్రథమంగా నిలుస్తుందన్నారు కేసీఆర్. గతంలో ఎన్నడూ లేని విధంగా 11,703 మెగావాట్ల గరిష్ట డిమాండ్ వచ్చినప్పటికీ ఏమాత్రం కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయగలిగే శక్తిని రాష్ట్రం సంతరించుకున్నదన్నారు. విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం రాబోయే కాలంలో మరింత పురోగమిస్తుందన్నారు.