బయటి దేశాల్లో కాళేశ్వరంపై కేటీఆర్​ చెబుతున్నవన్నీ అబద్ధాలే : షర్మిల

బయటి దేశాల్లో కాళేశ్వరంపై కేటీఆర్​ చెబుతున్నవన్నీ అబద్ధాలే : షర్మిల

హైదరాబాద్, వెలుగు : ‘‘సూటు, బూటు వేసుకొని కాళేశ్వరం విషయంలో బయటి దేశస్తుల చెవుల్లో చిన్న దొర పూలు పెడ్తున్నడు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నడు. అంత మాత్రాన అవి ఎప్పటికీ నిజం కావు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు తలమానికం కాదు.. గుదిబండ”అని మంత్రి కేటీఆర్​ను ఉద్దేశిస్తూ ట్విట్టర్​లో వైఎస్సాఆర్టీపీ చీఫ్ షర్మిల విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలను, రైతులను పిచ్చోళ్లను చేయలేవని మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడి ప్రజలకు జీవధార కాదని, కల్వకుంట్ల కుటుంబానికి కమీషన్ల ధార అని, తెలంగాణ ఖజానాకు కన్నీటి ధార అని ఆరోపించారు. కమీషన్లు కావాలనుకున్నప్పుడల్లా ప్రాజెక్ట్​ను ఏటీఎంలా వాడుకున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ అద్భుతం కాదని, అదొక వైఫల్యం అని అన్నారు.

ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారో చెప్పాలి

“లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారో మీకే తెలియని అయోమయ పరిస్థితి. చిన్న దొర 90 లక్షల ఎకరాలు అంటాడు. పెద్ద దొర 45 లక్షల ఎకరాలు అంటాడు. హరీశ్ రావు ఏమో అసెంబ్లీ వేదికగా 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం అంటాడు. సర్కారు వెబ్ సైట్ లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాం అని చెప్తారు. కమీషన్ల కాళేశ్వరంపై ఎవరి మాట నిజం? చిన్నదొర చెప్పినట్లు 97లక్షల ఎకరాలకు కాళేశ్వరమే సాగునీరు అందిస్తే.. రాష్ట్రంలో మిగతా సాగునీటి ప్రాజెక్టులు బంద్ పెట్టినట్లా? ఎస్సారెస్పీ, దేవాదుల, ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టులు చుక్క నీరు ఇవ్వనట్లా”అని షర్మిల ప్రశ్నించారు.

రైతు ఆత్మహత్యలు ఎందుకు ఆగుతలేవ్​?

లక్ష కోట్ల కాళేశ్వరం లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చిందో లేదో కానీ.. కేటీఆర్​ మాత్రం పచ్చి అబద్ధాలు చెప్తున్నారని షర్మిల ఫైర్ అయ్యారు. దేశాలు దాటి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. కమీషన్ల కాళేశ్వరంతో తెలంగాణ దేశానికి ధాన్యాగారం అయితే.. తొమ్మిదేండ్లలో 9వేల రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నట్లు అని ప్రశ్నించారు. రోజుకు ఇద్దరు, ముగ్గురు రైతులు ఎందుకు ఉరి వేసుకుంటున్నట్లు అని నిలదీశారు. వైట్ ఎలిఫెంట్​లా మారిన కాళేశ్వరంపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.