ఆర్టీసీని లాభ నష్టాల సంస్థగా చూడొద్దు

ఆర్టీసీని లాభ నష్టాల సంస్థగా చూడొద్దు
  • మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్

ముషీరాబాద్,వెలుగు:  ఆర్టీసీని లాభ నష్టాల సంస్థగా చూడొద్దని  మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ పేర్కొన్నారు. మెట్రోకు రాయితీలు ఇస్తున్నప్పుడు ఆర్టీసీకి ఇస్తే  వచ్చే ఇబ్బందేంటని ప్రశ్నించారు. పేదలు, స్టూడెంట్లకు   ఎంతో ఉపయోగపడే ఆర్టీసీకి రాయితీలు ఇవ్వకుండా ప్రభుత్వం విస్మరిస్తోందని విమర్శించారు. ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి గురువారం ఇందిరాపార్కు ధర్నా చౌక్​లో టీఎస్ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష  చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ హాజరై మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు తమ సంస్థ అభివృద్ధికి చాలా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. కార్మికులకు రిటైర్డ్ అయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వడం లేదని, దాచుకున్న సీసీఎస్  డబ్బులు కూడా ఇవ్వకపోవడం సరికాదన్నారు.  ఆర్టీసీకి నష్టాలకు కార్మికుల లోపాలేనంటూ వారిపై నెట్టివేయొద్దన్నారు.  పెరిగిన డీజిల్ ధరలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పన్నులు వేయడంతోనే  ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయన్నారు. ఆర్టీసీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టి బడ్జెట్​లో రెండు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో టీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మన్ రాజి రెడ్డి, వైస్ చైర్మన్ హనుమంతు, కన్వీనర్ వీఎస్ రావు, కమల్ రెడ్డి, సుద్దాల సురేష్, కో కన్వీనర్ అబ్రహం, యాదగిరి తదితరులు హాజరై మాట్లాడారు.