ప్రాక్టీస్ చేయడానికే షర్మిల తెలంగాణకు వచ్చింది

ప్రాక్టీస్ చేయడానికే షర్మిల తెలంగాణకు వచ్చింది

షర్మిల రాజకీయంగా ప్రాక్టీస్ చేయడానికే తెలంగాణలో పార్టీ పెడుతుందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ లీడర్ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాజగోపాల్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో ఏర్పాటు చేసిన చిట్‌చాట్‌లో జేసీ మాట్లాడారు.   

‘మిత్రులందరినీ ఓసారి కలుద్దామనే అసెంబ్లీకి వచ్చాను. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. తెలంగాణా ఇచ్చి కాంగ్రెస్ అక్కడా ఇక్కడా లేకుండా పోయింది. తెలంగాణ ఇచ్చి సోనియా గాంధీ పెద్ద తప్పు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. వేరే దారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. నాగార్జున సాగర్‌లో జానారెడ్డి గెలువలేడు. ఆయన కొడుకు రఘు వస్తే జనం వీళ్ల వైపు చూసే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు కాలం చెల్లింది. ప్రతి దానికి లైఫ్ ఉంటుంది. కాంగ్రెస్ టైం అయిపోయింది. రాయల తెలంగాణ కావాలని నేను ఇక్కడి రెడ్డి నేతలకు చెప్పాను కానీ, ఎవరూ వినలేదు. చివరి వరకూ జైపాల్ రెడ్డి కూడా రాయల తెలంగాణ కావాలన్నాడు. అయితే అందరూ ఆయనను తెలంగాణ ద్రోహి అంటున్నారని ఆ విషయంలో వెనక్కి తగ్గాడు. తెలంగాణలో బంగారు తెలంగాణ ఏడుంది. ఇక్కడ బంగారు తెలంగాణ లేదు.. ఏమీ లేదు. చంద్రబాబుకు ఒక్క పేజీ నోటీసు మాత్రమే ఇచ్చారు. అవే నోటీసులు సీఎం జగన్‌కు ఇవ్వాలంటే లారీ నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది. షర్మిల మొండి మనిషి మరియు పట్టుదల గల మనిషి. తెలంగాణలో ఆమె వెనక ఏ పార్టీ లేదు. ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే వచ్చింది. ఏడాదిన్నర తర్వాత షర్మిల క్యాంప్ విజయవాడకి షిఫ్ట్ అవుతుంది. రాజన్న రాజ్యం తెలంగాణలో అవసరం లేదు.. ఏపీలో అవసరం ఉందని ఆమె గ్రహిస్తుంది. ఆమె పార్టీ విషయంలో మోడీ కల్పించుకుంటే ఏంచేస్తుందో చూడాలి. ఆమెకు తెలంగాణ రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదు. తెలంగాణ నాయకులు పిచ్చివాల్లా? ఏపీలో షర్మిల పోటీ చేసేందుకు వాళ్ళ అమ్మ ఒప్పుకునే స్టేజీ దాటిపోయింది. ఉప ముఖ్యమంత్రి లేదా ఇతర పదవులు ఇస్తే అప్పుడు ఆమె సొంత పార్టీ ఏర్పాటుపై పునరాలోచన చేస్తుందేమో. రాయల తెలంగాణ వచ్చి ఉంటే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. ప్రత్యేక రాయలసీమ డిమాండ్ ఇప్పుడు నిలబడదు. నడపడానికి ఆర్థిక వనరులు కూడా లేవు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడినా బంగారు తెలంగాణ మాత్రం రాలేదు. ప్రాంతీయ పార్టీలు ఎక్కడ ఉన్నా నాశనమే. అన్న, తమ్ముడు, చెల్లి, అల్లుడు అందరికీ పదవులు కావాలి. జాతీయ పార్టీలే నయం. అనాయ్యం జరిగితే అడిగేవాడు ఉంటాడు. ప్రాంతీయ పార్టీలో ఏంజరిగినా ఎవరూ అడగరు. ఇంకో రెండేళ్ల తర్వాత బట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి నాగలి పట్టి వ్యవసాయం చేసుకోవాల్సిందే. రాజగోపాల్ రెడ్డి ఇంకో రెండు కాంట్రాక్టులు తెచ్చుకొని బిజినెస్ చేసుకుంటాడు’ అని జేసీ అన్నారు.


జేసీ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ‘ వైస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్‌ను తొక్కేయాలని కాంగ్రెస్ నాయకత్వం కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేసింది. జానారెడ్డిని సీఎం చేసి ఉంటే పరిస్థితి వేరేలే ఉండేది. కేసీఆర్‌ను గద్దె దింపే వరకు నేను విష్క్రమించను. తెలంగాణ వచ్చినందుకు ప్రజలు సంతోషంగా ఉన్నా.. ఆ ఫలాలు అందనందుకు బాధతో ఉన్నారు. ఇక్కడి కన్నా ఏపీలో పాలన దుర్మార్గంగా ఉందన్న జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు తప్పు. తెలంగాణలోనే దుర్మార్గపు పాలన ఉంది’ అని ఆయన అన్నారు.