కేసీఆర్ ఖబడ్దార్.. పోలీసు కేసులతో బీజేపీని అణచివేయలేరు : వివేక్

కేసీఆర్ ఖబడ్దార్.. పోలీసు కేసులతో బీజేపీని అణచివేయలేరు : వివేక్

బీజేపీ కార్యకర్తలపై పోలీసు కేసులు అన్యాయం

అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ఇలాగే చేశారు

ఆనాడు పోలీసులను కిరణ్ కుమార్ రెడ్డి తొత్తులు అని కేసీఆర్ విమర్శించారు

సీఎం అయ్యాక కేసీఆర్ ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు

ఖబడ్దార్ సీఎం.. పోలీస్ కేసులకు బీజేపీ భయపడదు

త్వరలో అమిత్ షాకు కంప్లయింట్ చేస్తాం

వివేక్ వెంకటస్వామి కామెంట్స్

టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని రాష్ట్ర బీజేపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతోందని విమర్శించారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇలాగే ప్రవర్తించినప్పుడు… కేసీఆర్ పోలీసుల తీరును తప్పుపట్టారని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తొత్తులుగా ప్రవర్తించొద్దని కేసీఆర్ విమర్శించిన సంగతి గుర్తుచేశారు. ఇపుడు కేసీఆర్ సీఎం అయ్యాక కూడా… పోలీసులతో బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అణచేయాలని చూస్తున్నారనీ.. అన్నారు. కేసీఆర్.. టీఆర్ఎస్ ఖబడ్దార్.. ఇలాంటివి చూస్తూ బీజేపీ ఊరుకోదు అని హెచ్చరించారు వివేక్.

బెల్లంపల్లిలో అప్పటికే తీసిన కొన్ని ఫొటోలు ఫార్వర్డ్ చేశారంటూ.. బీజేపీ కార్యకర్తలపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందని అన్నారు వివేక్ వెంకటస్వామి. జగిత్యాలలో మంత్రి, టీఆర్ఎస్ నాయకుల ఒత్తిడితో బీజేపీ వర్కర్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని చెప్పారు. పోలీసులను ఇలా తప్పుడు పద్ధతిలో వాడుకోవడం మానేయాలన్నారు. మంగళవారం నాడు ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి చెప్పామనీ.. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం.. పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తూ.. అణచివేతకు వాడుకుంటోందని.. ఈ పద్ధతి మార్చుకోవాలని సూచించారు వివేక్ వెంకటస్వామి.

కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ కమిషన్ ప్రాజెక్టుగా మార్చారనీ….. ఆ డబ్బుతో ఎమ్మెల్యేలు సహా.. దేన్నయినా కొంటాను అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు వివేక్ వెంకటస్వామి. సోలార్ పవర్ లో తెలంగాణ ను నంబర్ వన్ చేస్తానన్న సీఎం… ఎక్కువ రేటు పెట్టి ఎలక్ట్రిసిటీ కొనుగోలు చేసి… జనంపై రూ.10వేల కోట్లపైగా భారం మోపారన్నారు. ఖర్చు తగ్గించుకునే ఆలోచనతో.. ఎక్కువగా ఉన్న పీపీఏలను ఏపీ సీఎం జగన్ రద్దు చేసిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వాన్ని నడపడంలో కేసీఆర్ ఫెయిలయ్యారని అన్నారు. ఆయుష్మాన్ భవ కార్యక్రమం పై బీజేపీ నేతలు ఒత్తిడి చేయడం వల్లే… రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 400 కోట్లను వెంటనే మంజూరు చేసిందన్నారు.