93 ఎక్సలెన్స్ కేజీబీవీల్లో అడ్మిషన్లు షురూ.. 16 నుంచి దరఖాస్తులు.. మే 3న ఎగ్జామ్

93 ఎక్సలెన్స్ కేజీబీవీల్లో అడ్మిషన్లు షురూ.. 16 నుంచి దరఖాస్తులు.. మే 3న ఎగ్జామ్
  • టీజీఆర్జేసీ సెట్‌‌ ద్వారా  సీట్ల భర్తీ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని  కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) రూపురేఖలను మార్చేందుకు సర్కార్ సిద్ధమైంది. వీటిని కేవలం సాధారణ స్కూళ్లుగానే కాకుండా కొత్తగా ‘యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీలు’గా తీర్చిదిద్దుతోంది. తొలిదశలో 93 కేజీబీవీలను ఎక్సలెన్స్​గా మార్చింది. వీటిల్లో 2026-–27 విద్యా సంవత్సరానికి  ఇంటర్ అడ్మిషన్లకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తోంది. 

టీజీ ఆర్జేసీ సెట్‌‌–2026 ద్వారా మెరిట్ సాధించిన విద్యార్థినులకు ఈ కాలేజీల్లో సీట్లు కేటాయించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్​ ను అధికారులు రిలీజ్ చేశారు. హైదరాబాద్, మేడ్చెల్ జిల్లాలు మినహా మిగిలిన 31 జిల్లాల్లో రెండేసీ  చెప్పున మొత్తం 93 కేజీబీవీ ఎక్సలెన్స్ కాలేజీల్లో ప్రవేశపరీక్ష ద్వారా అడ్మిషన్లు చేపడుతోంది. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో అడ్మిషన్లు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. 

దీంట్లో చేరాలనుకునే విద్యార్థినులు ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 15 వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 3న ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నామని..మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు అలాట్ చేయనున్నట్టు వెల్లడించారు. అయితే,  మిగిలిన కేజీబీవీల్లో మాత్రం టెన్త్ క్లాసు మెరిట్ ఆధారంగానే సీట్లు అలాట్ చేయనున్నారు. మరిన్ని వివరాలకు  http://tgrjc.cgg.gov.in వెబ్ సైట్ చూడాలని సూచించారు. 

కాగా..రాష్ట్రంలోని 35 గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో (టీజీఆర్జేసీ)లో ఫస్టియర్ అడ్మిషన్లకూ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు టీజీ ఆర్జేసీ సెట్-2026కు ఈనెల 16 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సొసైటీ కార్యదర్శి రమణకుమార్ సూచించారు. టీజీఆర్జేసీ ఎగ్జామ్ మే 3న నిర్వహించనున్నారు.-----------