అద్భుతమైన ఎనర్జీ పాలసీ తెస్తం : భట్టి విక్రమార్క

అద్భుతమైన ఎనర్జీ పాలసీ తెస్తం : భట్టి విక్రమార్క
  •  క్వాలిటీ కరెంట్ అందిస్తం 

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: రాష్ట్రంలో గత బీఆర్ఎస్ పాలనలో సరైన ఎనర్జీ పాలసీ అన్నదే లేకపోయిందని.. తాము కొద్దిరోజుల్లోనే అద్భుతమైన పాలసీని తెస్తామని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. గ్రీన్ ఎనర్జీకి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన10.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్​ను అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్​తో కలిసి భట్టి ఆదివారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్లు రాష్ట్రంతో పాటు దేశానికి దిశానిర్దేశం చేస్తాయన్నారు. రాష్ట్రానికి ఆదాయం తేవడంతోపాటు కోల్ మైన్స్ పరిసర ప్రాంతాల ప్రజలకు జీవన భృతిని కల్పిస్తాయన్నారు. సింగరేణి లాభాలను రాష్ట్ర ప్రగతికి, కార్మికుల సంక్షేమానికే ఖర్చు చేస్తామని తెలిపారు. పంప్​ స్టోరేజ్​లో భాగంగా జలాశయాల్లో సోలార్, హైడల్ పవర్ స్టేషన్ల ద్వారా కరెంట్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని భట్టి చెప్పారు. మీడియం, మేజర్ ఇరిగేషన్​లోనూ సోలార్ పవర్​కు ప్రాధాన్యత ఇస్తామన్నారు. క్వాలిటీతో కూడిన కరెంట్ కావాల్సినంత అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.  

సింగరేణిని దివాలా తీయించిన్రు.. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని దివాలా తీయించిందని భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. కార్మికుల సంఖ్యను కూడా తగ్గించిందన్నారు. కొత్త కోల్ బ్లాక్​ల కోసం వేలంలో సింగరేణి పాల్గొనకుండా గత ప్రభుత్వం అడ్డుపడిందన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వంలో ఒక్క బ్లాక్ కూడా ఇతరులకు పోకుండా చూస్తామన్నారు. సింగరేణిలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశామన్నారు.

 ‘‘పాదయాత్ర సందర్భంగా ఇందారం ఓపెన్​కాస్ట్ మైన్​లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో మాట్లాడాను. వారిలో పర్మనెంట్ సెక్యూరిటీ గార్డుకు రూ. 46 వేల జీతం వస్తుంటే.. టెంపరరీ సెక్యూరిటీ గార్డుకు రూ. 11,500 మాత్రమే ఇస్తున్నట్లు తెలిసింది. ఒకే ఉద్యోగం చేస్తున్నా.. జీతాల్లో ఇంత తేడా ఉండటం అన్యాయం. అందుకే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇచ్చేలా ప్లాన్​ చేస్తున్నాం” అని ఆయన వెల్లడించారు. సింగరేణి ఉద్యోగులకు రూ.కోటి ఇన్సూరెన్స్ స్కీంను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభిస్తారని తెలిపారు. 

సింగరేణి సోలార్ ప్లాంట్లు ఆదర్శం: తుమ్మల 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బాగు చేసేందుకు చర్యలు చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సింగరేణి చేపట్టిన సోలార్ పవర్ ప్లాంట్లు  దేశానికే ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ప్రధాని మోదీ కూడా సోలార్ పవర్ ప్లాంట్లను ప్రోత్సహిస్తున్నారని.. కేంద్రంతో టైఅప్ అయి రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని 30 లక్షల బోరుబావులకు సోలార్ పవర్ ఇచ్చేలా విద్యుత్ మంత్రి భట్టి విక్రమార్క చర్యలు తీసుకోవాలని తుమ్మల కోరారు. 

అన్ని రంగాల్లోనూ సోలార్ పవర్ ప్లాంట్లు అవసరమన్నారు. డీఎంఎఫ్​టీ ఫండ్స్​ను సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోనే ఖర్చు చేయాలన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, మట్టా రాగమయి, రాందాస్ నాయక్ తమ ప్రాంతంలోని సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక అల, సింగరేణి డైరెక్టర్లు శ్రీనివాస్, సత్యనారాయణ, వెంకటేశ్వరరెడ్డి, సంఘాల ప్రతినిధులు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్ ప్రసాద్, జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ పాల్గొన్నారు.     

రేపు చేవెళ్లలో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500కే గ్యాస్ స్కీంలకు శ్రీకారం

బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన భద్రాద్రి పవర్ ప్లాంట్ ప్రభుత్వానికి గుదిబండగా మారిందని భట్టి ఫైర్ అయ్యారు. యాదాద్రి పవర్ ప్లాంట్​లో కరెంట్ ఉత్పత్తి కాకపోయినా.. కరెంట్ తెచ్చామంటూ గత ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. ఇప్పుడు తాము రాష్ట్రంలో మిగులు కరెంట్ లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్నామన్నారు. ఫ్రీ కరెంట్ స్కీంపై బీఆర్ఎస్ పార్టీ ప్రజలను రెచ్చగొడుతోందని ఆయన మండిపడ్డారు. ఈ నెల 27న చేవెళ్ల నుంచి 200 యూనిట్ల ఫ్రీకరెంట్, రూ. 500కే గ్యాస్ స్కీంలకు శ్రీకారం చుడుతున్నామని.. లబ్ధిదారులు మార్చి నెలలోకరెంట్ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదన్నారు.