డబుల్ ట్రబుల్ .. ఓటింగ్ పర్సంటేజీపై డ్యుయెల్ ఓట్స్ ఎఫెక్ట్

డబుల్  ట్రబుల్ ..   ఓటింగ్ పర్సంటేజీపై డ్యుయెల్ ఓట్స్ ఎఫెక్ట్

హైదరాబాద్: విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ ఇమేజ్ ను డబుల్ ఓట్లు డ్యామేజ్ చేస్తున్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో యాభై శాతం లోపు పోలింగ్ నమోదవడం హాట్ టాపిక్ గా మారింది.  చనిపోయిన వారి ఓట్లను డిలీట్ చేయకపోవడం, డ్యుయెల్ ఓట్ల కట్టడికి ఆధార్ లింకేజీ చేయకపోవడం, కొన్ని  ప్రాంతాల్లో అసలు ఫీల్డ్ విజిట్ ఉండకపోవడం పోలింగ్ పర్సంటేజీ మీద పడుతోందనే వాదన తెరమీదకు వచ్చింది. కొత్తగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ ఇంటికి వచ్చి వివరాలను పరిశీలించి ఓకే చేయాల్సి ఉంటుంది. అయితే అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు  రావడం లేదని, ఆన్ లైన్ లో నమోదు చేసిన నంబర్ కు కాల్ చేసి ఓకే చేసేస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో నమోదు చేసుకొని ప్రస్తుతం అక్కడ ఉండని వారి ఓట్లనూ డిలీట్ చేయడం లేదు. కొత్త జాబితా రూపకల్పనకు ముందు ఫీల్డ్ విజిట్ జరగడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో ఒక్కో బస్తీ జనాభా సుమారు పది వేలు ఉంటే.. అందులో 12 వేల నుంచి 13 వేల ఓట్లు ఉన్నాయనే వాదన ఉంది. జనాభాను మించి ఓట్లుండటం.. కాలనీలో అందరూ ఓట్లు వేసినా వందశాతం పోలింగ్ నమోదు కావడం లేదంటున్నారు. 

చనిపోయిన వారి ఓట్లు 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలున్నాయి. ఇక్కడ దాదాపు 20 ఏండ్లుగా ఇక్కడ ఓటర్ల జాబితా సవరణ జరగలేదు. జాబితాలో చనిపోయిన వారి పేర్లను తీసేయలేదు. కరోనా వేళ పిట్టల్లా జనం రాలిపోయారు. ఇప్పటికీ వారి పేర్లు జాబితాలో దర్శనం ఇస్తున్నాయి. దీనికి తోడు వృద్ధాప్యం, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు తదితర కారణాలతో మరణించిన వారి పేర్లు కూడా ఇప్పటికీ జాబితాల్లో ఉన్నాయి. వాటిని సంస్కరించే మెకానిజం లేకపోవడంతో చనిపోయిన వారి పేర్లు కూడా జాబితాల్లో దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆ ఓట్లు కూడా పడుతుండటం విశేషం. 

ఆధార్ లింక్ చేస్తేనే..

ఉద్యోగాలు, వ్యాపారాల కోసం పొరుగు రాష్ట్రాలతోపాటు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో కుటుంబాలు హైదరాబాద్ మహానగరానికి వలసవచ్చాయి. ఈ కుటుంబాలకు స్వస్థలాల్లో భూములు, జాగాలు, ఇండ్లు ఆస్తులు ఉండటంతో అక్కడ ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఆధార్ కార్డు అక్కడే ఉండటంతో వాటిని లింక్ చేయించుకున్నారు. హైదరాబాద్ లో దరఖాస్తు చేసుకొని ఇక్కడ కూడా ఓటు హక్కు పొందారు. వీళ్లంతా సెలవులు వస్తే సొంతూళ్ల బాటపడుతున్నారు. అక్కడే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్ లో పర్సంటేజీ గణనీయంగా పడిపోవడానికి ఇది కూడా కారణమనే వాదన వినిపిస్తోంది. 

జీహెచ్ఎంసీ పరిధిలో 50% లోపే

జీహెచ్ఎంసీ పరిధిలో మూడు పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. ఇందులో మల్కాజ్ గిరి లో 50.78, సికింద్రాబాద్ లో 49.04, హైదరాబాద్ లో 48.48% పోలింగ్ నమోదైంది. యావరేజ్ గా 49.43% ఓటింగ్ నమోదైంది. పొరుగునే ఉన్న చెన్నయ్, బెంగళూరు మహా నగరాలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. చెన్నయ్ లో 55.94, బెంగళూరులో 54.76% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ లో యాభై శాతం లోపే ఉండటం గమనార్హం. 

జాబితాలో సవరణలు మస్ట్

హైదరాబాద్ మహానగరంలోని ఓటర్ల జాబితాను సవరిస్తే ఎలాంటి సమస్యలు రావనే భావన ఉన్నది. కొందరు ఓటేసేందుకు విముఖత చూపుతున్నా.. పోలింగ్ శాతం మరీ యాభై శాతం లోపు నమోదు కాదంటున్నారు విశ్లేషకులు.  పాతనగరమే కాదు జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోనూ డోర్ టు డోర్ రీ వెరిఫికేషన్ చేయడంతోపాటు ఆధార్ లింకేజీ చేస్తే సగానికి సగం ఓట్లు డిలీట్ అవుతాయనే వాదన ఉంది. దీనిపై ఎన్నికల కమిషన్, అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.  
 

  • సౌత్ లో మనమే వెనుక బడ్డాం!
  • విశాఖపట్నం    71.11
  • తిరువనంతపురం    66.46
  • చెన్నయ్        55.94
  • బెంగళూరు        54.76
  • హైదరాబాద్    49.43